మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మాన్ సూన్ ఆఫర్
posted on Jul 1, 2015 3:29PM
.jpg)
సాధారణంగా వ్యాపారులు మాత్రమే పండగలు, వివిధ సీజన్లలో ప్రజలను ఆకట్టుకొనేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ రాజకీయ పార్టీలు కూడా మంత్రి పదవులు, రాజ్యసభ టికెట్లో లేక ఏదో ఒక బంపర్ ఆఫర్లు ఇచ్చి ఎదుటపార్టీ నేతలని ఆకర్షిస్తుంటాయి. అటువంటివెన్ని చేసినా అవి నైతికమయినవేనని కానీ దొరికిపోతే మాత్రం చాలా తీవ్ర నేరం చేసినట్లేనని ఒక నిశ్చితాభిప్రాయంతో ఉంటాయి.
ఇక విషయంలోకి వస్తే ఈనెల 21నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అదేమిటంటే ఆర్ధిక నేరస్తుడు లలిత్ మోడీకి సహాయపడినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ఇరువురినీ పదవులలో నుండి తొలగించినట్లయితే, తమ పార్టీ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి అండ్ బి)బిల్లు ఆమోదానికి సహకరిస్తుందని సూచించింది. లేకుంటే ఈ వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి వారిరువురి రాజీనామాకి పట్టుబట్టడం ఖాయమని సూచించింది.
ఇంతకు ముందు మోడీ ప్రభుత్వం ఈ జి అండ్ బి బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానిలో ఐదు సవరణలు సూచించింది. 1.ఈ బిల్లులో పొగాకు మరియు విద్యుత్ పరికరాలపై పన్ను చేర్చడం. 2. అందుకు పరిహారంగా సదరు ఉత్పత్తులు చేస్తున్న రాష్ట్రాలకు 1 శాతం పన్ను మినహాయింపు. 3. ఈ పరిహార విధానాన్ని బిల్లులో పొందు పరచడం. 4. ఇదివరకు తొలగించిన వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని తిరిగి ఈ బిల్లులో పొందు పరచడం. 5. వివిధ కేటగిరీలకు గరిష్ట పన్ను పరిమితిని ఈ బిల్లులో పొందుపరచడం.
మోడీ ప్రభుత్వం ఈ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కానీ రాజ్యసభలో దానిని ఆమోదింప జేసుకోనేందుకు ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యా బలం లేదు కనుక కాంగ్రెస్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చాలా ఆలోచించదగ్గదే. కానీ అందుకు అంగీకరిస్తే కాంగ్రెస్ పన్నిన వలలో చిక్కుకొన్నట్లే అవుతుందని మోడీ ప్రభుత్వానికి తెలుసు. కాంగ్రెస్ కోరినట్లుగా ఇరువురు మంత్రులను తొలగిస్తే తన నేరాన్ని ఒప్పుకొన్నట్లవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేబట్టి మరింత అప్రదిష్టపాలు చేస్తుంది.
ఇక పార్టీలో సీనియర్ నేతలయిన సుష్మా, రాజేలను బలవంతంగా పదవులలో నుండి తొలగిస్తే వారు అసంతృప్తికి గురవుతారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందరా రాజే అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్దమని సంకేతాలు ఇదివరకే పంపారు. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ని మోడీ ప్రభుత్వం స్వీకరించే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్ పార్టీ సూచించిన జి అండ్ బి బిల్లులో సూచించిన సవరణలపై అధ్యయనం చేయడానికి ఇదివరకే రాజ్యసభ సభ్యులతో కూడిన ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం అయింది. ఆ కమిటీ ఆమోదం తెలిపితే బిల్లులో కాంగ్రెస్ సూచించిన సవరణలు చేసే అవకాశంశం ఉంది. అప్పుడు ఎలాగూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆ బిల్లుకి మద్దతు తెలుపవచ్చునని బీజేపీ భావిస్తోంది.