అన్ని అరిష్టాలకు మూల కారణం ఆ పార్టీయేనా?
posted on: Jun 11, 2015 11:56AM
.jpg)
రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలలో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వాటి మధ్య జరుగుతున్నగొడవలన్నీ ఒక ఎత్తయితే, రేవంత్ రెడ్డి కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై వాటి మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కటీ మరొక ఎత్తని చెప్పవచ్చును. ఇంతవరకు జరుగుతున్న యుద్దాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చును. అయితే వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీనే నిందించవలసి ఉంటుంది. గత పదేళ్ళుగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుగుతున్నా పట్టించుకోకుండా కూర్చొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలం ఆరు నెలలలోనే విభజించేసి చేతులు దులుపుకొంది.
రాష్ట్రంలో ఆర్టీసీ వంటి ఒక సంస్థను రెండుగా విభజించడానికి ఏడాదిగా పట్లు పడుతున్నా సాధ్యం కాక ఇరు రాష్ట్రాలు తలలు పట్టుకొని కూర్చొన్నాయి. అటువంటి కొన్ని వందలు సంస్థలు, వ్యవస్థలు సమ్మిళితమయిన ఒక రాష్ట్రాన్ని ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయగలగడం నిజంగా చాలా ఆశ్చర్యకరమయిన విషయమే. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసామని చాల గొప్పలు చెప్పుకొంది కానీ అది చేసిన పనికి తెలంగాణా ప్రజలయినా సంతోషించారా? అంటే అదీ లేదని ఎన్నికలలో రుజువు చేసారు.
ఇక అది చేసిన ఈ నిర్వాకానికి ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ఏవిధంగా శిక్షించారో ఆ పార్టీ నేతలకి కూడా తెలుసు. ప్రజలు శిక్షించక మునుపే అనేక సీనియర్ నేతలు అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది..కన్నా లక్ష్మి నారాయాణ, కావూరి, బొత్స వంటి సీనియర్ నేతలు పార్టీని విడిచిపెట్టి పారిపోయారు. గత పదేళ్ళుగా తెలంగాణా కోసం అనేక వేలమంది బలిదానాలు చేసుకొన్నా కాంగ్రెస్ అధిష్టానికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడి రాజకీయ భవిష్యత్ కాపాడటం కోసం, కనీసం తెలంగాణాలో అయినా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఎన్నికల ముందు ఆఘమేఘాల మీద రాష్ట్ర విభజన చేసేసింది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కలేదు.
కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు రెండు రాష్ట్రాలలో ప్రజలెవరూ బాధపడలేదు. కానీ అది చేసిపెట్టిన ఈ నిర్వాకానికి నిత్యం ఆ పార్టీని తిట్టుకొంటూ నానాబాధలు పడుతున్నారు. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీలు అందరూ కూడా ఏదో ఒక అంశం మీద కాంగ్రెస్ పార్టీని తిట్టుకొంటూనే ఉన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సమస్యను తీర్చే ప్రయత్నంలో అనేక వందల వేల సమస్యలను సృష్టించిపోయింది. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించిన తెలుగు ప్రజలు ఇకపై మరికొన్ని దశాబ్దాల పాటు దానిని ఇలాగే తిట్టుకొంటారేమో?




.jpg)


.webp)


