కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే మారేది బీజేపీ రూపమే
posted on: Jan 22, 2015 8:50PM
.jpg)
బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్దిష్టమయిన ఒక ప్రణాళికను తమకు ఇచ్చేరని దానిని తాము తూచా తప్పకుండా పాటించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రహితంగా మార్చాలనే తమ నిర్ణయంలో మార్పులేదని అన్నారు. కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలకి చెందిన కొందరు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వారందరూ ఈ నెలాఖరులోగా పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. కానీ వారి పేర్లను బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు.
మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 10లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషిచేస్తున్నామని, తమ అధ్యక్షుడు అమిత్ షా సూచించిన విధంగా 45,000 మంది యాక్టివ్ మెంబర్స్ ను జేర్పించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మంచి వ్యూహమే సిద్దం చేసుకొంది. కానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్తి కలిగిస్తామని చెపుతూనే మళ్ళీ అదే పార్టీకి చెందిన నేతలని తమ పార్టీలో చేర్చుకోబోతున్నట్లు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీనేతలకి బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొంటే అప్పుడు బీజేపీయే తన స్వరూపం కోల్పోయి మరో కాంగ్రెస్ పార్టీగా మారుతుంది.
కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనకు సహకరించినందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారిని గట్టిగా శిక్షించారు. ప్రజలు వారిని క్షమించేందుకు సిద్దంగా లేరు. అటువంటి వారినందరినీ బీజేపీలో చేర్చుకోవడం వలన బీజేపీని కూడా ప్రజలు దూరం పెట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని కనబడకుండా చేయాలని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరివల్లా కాదు. గత 125సం.లుగా ఆ పార్టీ ఇటువంటి ఓడిడుకులను అనేకసార్లు ఎదుర్కొని మళ్ళీ లేచి నిలబడింది. కొంతమంది పాత నాయకులు పోతే ఆ స్థానంలోకి మళ్ళీ కొత్త నాయకులు వచ్చి చేరుతుంటారు. పైగా నేటికీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయమయిన ఓటు బ్యాంకు భద్రంగానే ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మరణం ఉండబోదు.
ఈరోజు బీజేపీలో చేరే నేతలే రేపు పరిస్థితులు మారితే వెంటనే కాంగ్రెస్ గూటికి చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. కనుక అవకాశావాదులయిన అటువంటి నేతల కోసం అర్రులు చాచడం కంటే రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ ప్రక్రియ ద్వారా తమ సంఖ్యని పెంచుకొని వారిలోనుండే నిఖార్సయిన మంచి నాయకులను తయారుచేసుకోవడం మంచిది.



.jpg)
.gif)

.webp)



