నందిగామలో కాంగ్రెస్ వ్యూహం ఎదురు తన్నబోతోందా?
posted on: Sep 12, 2014 3:20PM
.jpg)
నందిగామ ఉప ఎన్నికలను తెదేపా ప్రభుత్వం యొక్క వందరోజుల పరిపాలనపౌ ప్రజలివ్వబోయే తీర్పుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ, ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెపుతానంటూ ఎన్నికల బరిలోకి దిగింది. కానీ నిజానికి కాంగ్రెస్ ఆలోచన, ఉద్దేశ్యం వేరే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు తమపై చాలా ఆగ్రహంగా ఉన్నందునే తమకీ దుస్థితి ఏర్పడిందని వారికి తెలుసు. అయితే ఇదంతా జరిగి అప్పుడే మూడు నెలలయిపోయింది కనుక ఇప్పటికయినా ప్రజలు తమ పార్టీపై మెత్తపడ్డారా లేదా? అనే సంగతి తెలుసుకొనేందుకే ఈ ఎన్నికలలో ఒక బాబురావును బకరాగా చేసి నిలబెట్టారు. ఒకవేళ ఆయన స్వంత కష్టంతోనో మరో రకంగానో ఈ ఎన్నికలలో నెగ్గితే ఇక కాంగ్రెస్ తన ఈ వాదనకు మరింత పదును పెడుతుంది. అంతే కాక ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ శాసన సభలో అడుగుపెట్టవచ్చనే అత్యాస కూడా ఉంది.
అయితే తెదేపా శాసనసభ్యుడు తంగిరాల ప్రభాక రావు ఆకస్మిక మరణం వలన నిర్వహిస్తున్న ఈ ఎన్నికలలో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తునందున, నందిగామ ప్రజలు ఆమెపై సానుభూతి చూపుతూ ఆమెకే ఓటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే వైకాపా కూడా తన అభ్యర్ధిని పోటీలో నిలపలేదు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను తెదేపా ప్రభుత్వ పాలనపై తీర్పు అని చెపుతూ ఎన్నికల బరిలో దిగడం పెద్ద తప్పు అవుతుంది. అంటే కాంగ్రెస్ అతితెలివి ప్రదర్శించడం వలన తను స్వయంగా నష్టపోతూ తెదేపాకు మేలు చేయబోతోందన్నమాట. తెదేపా అభ్యర్ధి సౌమ్య సానుభూతి ఓట్లతోనే విజయం సాధించినప్పటికీ, దానిని తెదేపా ప్రభుత్వం తన వందరోజుల పాలనపై తీర్పు గానే చెప్పుకొనే అవకాశం కాంగ్రెస్ పార్టీయే చేజేతులా తెదేపాకు అందించినట్లయింది. అంతే కాదు, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరో మారు ఘోర పరాజయం పొందితే, అది ఆ పార్టీకి చెంపపెట్టుగా మిగిలిపోతుంది. అధికార తెదేపా ప్రభుత్వానికి బుద్ధి చెపుతానని ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ తను ఎంచుకొన్న తప్పుడు ఉపాయానికి మళ్ళీ తనే బలవబోతోందని అర్ధమవుతోంది.




.jpg)

.webp)



