ఓటమి నుండి గుణపాటం నేర్చుకోని కాంగ్రెస్
posted on: Jul 2, 2014 7:35AM
.jpg)
35మంది సభ్యులుండే తెలంగాణా శాసనమండలిలో టీ-కాంగ్రెస్ పార్టీకి 17మంది సభ్యులుండగా, తెరాసకు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెరాస ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో నిలువరించగలిగే పరిస్థితిలో ఉండేది. అదేవిధంగా చాలా అవలీలగా మండలి చైర్మన్ పదవి దక్కించుకొనే అవకాశం ఉండేది. కానీ, ఆ పార్టీ నేతలు టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పదవి నుండి దింపి, దానిలో తాము కూర్చొనే ప్రయత్నాలలో తమలో తామే కుమ్ములాడుకొంటుంటే, ఇదే అదునుగా తెరాస కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు శాసనమండలి సభ్యులను పార్టీ ఫిరాయింపజేసింది కాంగ్రెస్ ను దెబ్బతీసింది. అంతేకాక మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు కూడా తెరాస అభ్యర్ధి స్వామిగౌడ్ కే ఓటేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా ఫారూక్ హుసేన్ను నిలబెట్టినా అతనికి కనీసం పార్టీలో మిగిలిన సభ్యులయినా ఓటేస్తారనే నమ్మకం లేదు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలున్నప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు టికెట్లు, పదవుల కోసం కుమ్ములాడుకొంటూ పార్టీని చేజేతులా ముంచుకొన్నారు. అయినప్పటికీ వారు ఓటమినుండి ఎటువంటి గుణపాటం నేర్చుకోకుండా కుమ్ములాడుకొంటూ ఇప్పుడు శాసనమండలి చైర్మన్ పదవిని, చివరికి తమ పార్టీ సభ్యులని కూడా పోగొట్టుకొన్నారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీని ఇతరులెవరూ ఓడించలేరని తమను తామే ఓడించుకొంటామని, అప్పుడే ఇతర పార్టీలు గెలుస్తుంటాయని గొప్పగా చెపుతుంటారు. వారి మాటలు నిజమేనని అంగీకరించక తప్పదు.



.jpg)


.webp)



