రాహుల్ గాంధీ జోకర్ల టీమ్ కు లీడరు: కాంగ్రెస్ నేత
posted on: Jun 1, 2014 2:50PM
.jpg)
ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరపరాజయం తరువాత అందుకు కారకులయిన పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కొడుకు రాహుల్ గాంధీలకు వ్యతిరేఖంగా కాంగ్రెస్ పార్టీలోనే విమర్శించేవారు రోజురోజుకి పెరుగుతున్నారు. వారం రోజుల క్రితం కేరళా రాష్ట్రానికి చెందిన ముస్తఫా అనే మాజీ మంత్రి రాహుల్ గాంధీని జోకర్ అని, అతను వెంటనే పదవిలో నుండి దిగిపోవాలని లేకుంటే బలవంతంగానయినా వెంటనే దింపేయాలని డిమాండ్ చేయడంతో, ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసారు.
మళ్ళీ నిన్న రాజస్తాన్ కు చెందిన భన్వర్ లాల్ శర్మ అనే కాంగ్రెస్ యం.యల్యే. మరో అడుగు ముందుకు వేస్తూ, “రాహుల్ గాంధీ ఒక జోకర్స్ టీంకు మేనేజింగ్ డైరెక్టర్ వంటివాడు. దశాదిశలేని వ్యక్తి. అతనికి సరయిన ఆలోచనలు కానీ రాజకీయ విధానాలు గానీ ఏమీ లేవు. ఆయన చుట్టూ ఉన్న దిగ్విజయ్ సింగ్, సీపీ జోషి వంటివారు కూడా అటువంటి వ్యక్తులే. వారి అసమర్ధత కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. పార్టీలో ప్రజాస్వామ్యం పోయి దాని స్థానంలో భజనస్వామ్యం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పుతున్నప్పుడు దానిని దారిలో పెట్టవలసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెద్దలు కూడా తమ పదవులను కాపాడుకొనేందుకు సోనియా, రాహుల్ గాంధీల భజనలో మునిగిపోయారు. అందుకే పార్టీ ప్రమాదం అంచున ఉన్నప్పటికీ వారెవరూ కూడా హెచ్చరించలేదు. ఒకవేళ హెచ్చరించినా సోనియా, రాహుల్ వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారి చుట్టూ చేరిన దిగ్విజయ్ సింగ్ వంటి భజన సంఘం నేతలు, వారికీ, పార్టీ శ్రేయోభిలాషులకు మధ్య అడ్డుగోడగా నిలబడి ఉన్నారు. అందువలన ఇప్పటికయినా సోనియాగాంధీ తన పుత్రా వాత్సల్యాన్ని కొంచెం పక్కనబెట్టి సమర్దులయిన వ్యక్తుల చేతిలో పార్టీని పెట్టినట్లయితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది,” అని భన్వర్ లాల్ శర్మ ఘాటుగా విమర్శించారు. ఆయనకు ముస్తఫాకు పట్టిన గతే పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఉంటే, రేపు ఎప్పుడయినా సోనియా గాంధీ రాజకీయాల నుండి తప్పుకొన్నట్లయితే, ఇక రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఖాతరు చేస్తారా? అనే అనుమానం కలుగుతోంది.



.jpg)
.jpg)

.webp)



