మోడీ భజనలో తరిస్తున్న కాంగ్రెస్ నేతలు

posted on: Sep 11, 2014 11:08PM

 

కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ప్రతిపక్షాలను విమర్శించడం, వీలయితే వాటిని నయాన్నో భయాన్నో లొంగదీసుకోవడం, అవసరమయితే వాటితో రహస్య ఒప్పందాలు చేసుకోవడమే ఇంతవరకు ప్రజలు చూసారు. కానీ ఈసారి ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత వారి తీరులో చాలా ఆశ్చర్యకరమయిన మార్పులు కనబడుతున్నాయి.

 

కొందరు కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ పార్టీ ఓటమికి బాధ్యత వహించి తమ పదవులో నుండి దిగిపోవాలని నేరుగా కోరారు. అటువంటి ఆలోచన ఇంతకు ముందు ఎన్నడూ ఎవరికీ కలగలేదు. కానీ ఓటమి కారణంగానే వారిలో ఆ మార్పు కనబడిందని అర్ధమవుతోంది. ఆ తరువాత శశీ ధరూర్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వాన్ని ఏదో సందర్భంలో తెగ మెచ్చేసుకొంటే, కాంగ్రెస్ అధిష్టానం అందుకు చాలా నొచ్చేసుకొంది.

 

ప్రధాని మోడీని బద్ద శత్రువుగా భావించే దిగ్విజయ్ సింగ్ కూడా కాశ్మీరు వరద ముంపు ప్రాంతాలలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. మోడీని ఎప్పుడూ తిట్టడమే తప్ప పొగడటం అలవాటు లేని దిగ్విజయ్ సింగ్ లో ఈ అనూహ్య మార్పు కాంగ్రెస్ ఓటమి కారణంగా వచ్చిందా లేక లేటు వయసులో ఘాటు ప్రేమాయణం సాగించినందున జగమంతా ప్రేమమయంగా కనబడుటుంటే తన శత్రువు మోడీని పొగిడారా? అనే అంశంపై పరిశోధన చేయవలసి ఉంది.

 

ఇక మాజీగా మారిన కేరళ గవర్నరు షీలా దీక్షిత్ కూడా డిల్లీని పాలించేందుకు బీజేపీకే హక్కు ఉందన్నట్లు మాట్లాడి తన అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు సరిపోయినంత మంది యం.యల్యే.లు బీజేపీకి ఉన్నట్లయితే ఆ పార్టీకి అధికారం చేప్పట్టేందుకు అవకాశం ఇవ్వడం మేలని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె తమ రాజకీయ ప్రత్యర్ధ పార్టీ బీజేపీ డిల్లీలో అధికారం చేప్పట్టాలని ఎందుకు కోరుకొంటున్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమె ఆవిధంగా మాట్లాడటం జీర్ణించుకోలేక పోతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగాతమయినవని దానితో పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని ఒక పడికట్టు ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకొంది.

 

ఇంతవరకు సోనియా, రాహుల్ భజనలో జీవితాలు ధన్యం చేసుకొన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రహ్లాదుడిలా తమ శత్రువు మోడీకి భజన చేయడం చాలా విచిత్రంగానే ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...