తమిళనాడు.. బీహార్.. కాంగ్రెస్ పొత్తులు పెటాకులేనా?

సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి పొత్తు ధర్మం పాటించడం, మిత్రులను కాపాడుకోవడం అన్నది  ఇప్పటికీ వంటపట్టలేదు. భాగస్వామ్య పార్టీలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తూ పొత్తులు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చేజేతులా సృష్టించుకుంటోంది. బీహార్ లో ఆర్జేడీతోనూ, తమిళనాడులో అధికార డీఎంకేతోనూ ఇప్పుడు కాంగ్రెస్ బంధం పుటుక్కున తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా తమిళనాడు విషయం తీసుకుంటే..  ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన సినీ నటుడు విజయ్ ను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్నవిన్యాసాలు, ప్రయత్నాలు అధికార డీఎంకేకు రుచించడం లేదు. విషయమేంటంటే.

కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత టీవీకే అధ్యక్షుడు విజయ్ కు రాజకీయంగా ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన స్టార్ డమ్ ను ఆ ఘటన మసకబార్చిందనడంలో సందేహం లేదు. అయితే ఆ సంఘటన తరువాత విజయ్ కు సానుభూతి పెరుగుతుందన్న అంచనాతో కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమద్దతుగా ప్రకటనలు గుప్పించడం ఆరంభించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విజయ్ కు ఫోన్ చేసి మద్దతు పలికారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

వాస్తవానికి విజయ్ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తమకు రాజకీయ శత్రువులు అని విజయ్ గతంలోనే ప్రకటించారు. బీజేపీ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ చూపుతూ కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  అయితే  కరూర్ తొక్కిసలాట ఘటనలో  టీవీకే అధినేత విజయ్ తప్పిదాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయనను ఇరుకున పెట్టే వ్యూహాన్ని డీఎంకే అమలు చేస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్ విజయ్ పట్ల సానుభూతి వ్యక్తం చేయడం సహజంగానే డీఎంకేకు ఇబ్బందికరంగా మారింది. తమిళనాట డీఎంకేను పక్కన పెట్టి విజయ్ తో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా కాంగ్రెస్ తీరు ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ అనుమానాలు, విజయ్ పట్ల కాంగ్రెస్ సానుభూతి వ్యక్తం చేస్తూ అనుకూల ప్రకటేనలు చేయడం డీఎంకే, కాంగ్రెస్ కూటమి కొనసాగింపునకు ప్రతిబంధకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.   

ఇక వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ తీరు వల్ల అక్కడ మహాఘట్ బంధన్ చీలికలు పేలికలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కూటమి మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న తరుణంలో  కాంగ్రెస్ తీరు వల్ల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఆర్జేడీ కీలక నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్.. బీహార్ లో పొత్తుపొసగకుంటే.. ఆర్జేడీ అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడుతుందన్న హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణమేంటన్న ప్రశ్నకు పరిశీలకులు ఓట్ అధికార్ యాత్ర తరువాత కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమంటున్నారు.  ఓటర్ అధికార్  యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేసిందన్న అంచనాతో  కాంగ్రెస్ సీట్ల సంఖ్య విషయంలోనూ,  ఎంపికలోనూ చేస్తున్న ఓవర్ యాక్షనే తేజస్వి ప్రసాద్ హెచ్చరికకు కారణంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ సిట్టింగ్ స్థానాలను కోరడంతో ఆర్జేడీలో అసంతృప్తి భగ్గుమని అవసరమైతే పొత్తే లేకుండా రంగంలోకి దిగాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu