కాంగ్రెస్, బీఆర్ఎస్ చెట్టాపట్టాల్!

posted on: Feb 16, 2026 3:42PM

బీఆర్ఎస్ బీజేపీలో  విలీనమౌతుందంటూ  కాంగ్రెస్, కాంగ్రెస్- బీఆర్ఎస్ ఒక‌టేన‌ని బీజేపీ,  బీజేపీ- కాంగ్రెస్ కుమ్ముక్క‌య్యార‌ని బీఆర్ఎస్. ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ ఆరోపణలతో దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలో  మ‌రెక్క‌డా లేని విధంగా కుమ్ముక్కు రాజ‌కీయాలు కేవ‌లం తెలంగాణ‌లో మాత్ర‌మే నడుస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది.  ఇటు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ నుంచి మొద‌లు పెడితే  అటు కేటీఆర్,  మరో వైపు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజ‌య్ వ‌ర‌కూ ఎవ‌రికి వారు  ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ పులిహోర క‌లిపేస్తుంటారు. 

అయితే ఈ రాజ‌కీయ ఆరోప‌ణ‌లు ప‌క్క‌న  పెడితే కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ క‌లిసిపోయాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలి పురపోరులో కామారెడ్డి మునిసిపాలిటీలో కాంగ్రెస్   19 వార్డుల్లో విజయం సాధించింది. అంత కంటే రెండు తక్కువగా  బీజేపీ 16 వార్డుల్లో జయకేతం ఎగురవేసింది. కామారెడ్డిలో బీఆర్ఎస్ పదకొండు వార్డుల్లో విజయం సాధించింది.దీంతో కామారెడ్డి మునిసిపాలిటీలో చైర్మన్ పదవి దక్కించుకోవడానికి అవసరమై మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చైర్మన్ పదవి దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుకున్నాయి. దీంతో  కాంగ్రెస్ అభ్య‌ర్ధికి ఉమారాణి చైర్మన్ గానూ, బీఆర్ఎస్ కు చెందిన   కాస‌ర్ల గోదావ‌రి  వైస్ చైర్మ‌న్ గానూ పదవులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.   2023 ఎన్నిక‌ల నాటి పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే.. ఇదే  కామారెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధి  రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి పోటీ పడగా, ఇరువురూ పరాజయం పాలయ్యారు. బీజేపీకి చెందిన వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ఒకే ఎన్నికలో ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత సాధించారు.  
ఇక ప్రస్తుతానికి వస్తే.. కామారెడ్డిలో ఎప్పుడూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుంది. అటువంటిది.. ఆ రెండు పార్టీలూ చెట్టాపట్టాలేసుకుని మరీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను పంచుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు కామారెడ్డి జనం.  

ఇక   కొత్త‌గూడెంలో కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే కనిపిస్తున్నది. 60 స్థానాలున్న కొత్తగూడెం మునిసిపాలిటీలో తాజా పురపోరులో  వామపక్షాలకు 22 వార్టుల్లోనూ, , కాంగ్రెస్ 22 వార్డుల్లోనూ గెలుపొందాయి. దీంతో మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో సీపీఐకి మద్దతు ఇస్తామంటూ బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. బీఆర్ఎస్ కు కొత్తడూగెం మునిసిపాలిటీలో ఎనిమిది వార్డులు దక్కాయి. మేయర్ పదవి కాంగ్రెస్ కు రాకుండా అడ్డుకోవడానికి తాము వామపక్షాలతో కలవడానికి రెడీ అంటోంది బీఆర్ఎస్. పోరాడ్డానికి తాము సీపీఎంతో జ‌త‌క‌ట్ట‌డానికైనా  సిద్ధ‌మేనంటోంది కారు పార్టీ.

ఇక్కడ కూడా  2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకుని పోటీ చేయగా,  పొత్తులో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానం సీపీఐకి దక్కింది. ఇక్కడ నుంచి సీపీఐ అభ్యర్థిగా  కూనంనేని సాంబ‌శివ‌రావు గెలుపిందారు.  దానిని గుర్తు చేస్తూ, కొత్తగూడెం మునిసిపాలిటీలో పోటీ కేవలం ఫ్రెండ్లీ కంటెస్టేనంటూ చైర్మన్ అభ్యర్థిగా తాము సీపీఐకి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.  

ఇలా తెలంగాణలో పురపోరులో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు దక్కించుకోవడానికి ఓ చోట అధికారపక్షం కాంగ్రెస్ తో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతులు కలిపితే.. మరో చోట వామపక్షాలకు కారు కలుపుకుంటోంది.   రాజకీయాలను పక్కన పెట్టి మరీ..  స్థానిక సంస్థ‌లలో అధికారం కోసం అధికార, విపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...