తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకే అవకాశం

posted on: May 14, 2014 12:59PM

 

సీమాంద్రాలో మున్సిపల్, యంపీటీసీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన ప్రత్యర్ధి వైకాపాపై స్పష్టమయిన ఆధిక్యత ప్రదర్శించినందున, సార్వత్రిక ఎన్నికలలో కూడా తెదేపాయే విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెలంగాణాలో కాంగ్రెస్ కొంత ఆధిక్యత కనబరిచినప్పటికీ, తెరాస దానికి సమఉజ్జీగా నిలవడంతో సార్వత్రిక ఎన్నికలలో సైతం ఆ రెండు పార్టీలలో దేనికీ కూడా పూర్తి మెజార్టీ దక్కకపోవచ్చును. అప్పుడు తప్పనిసరిగా వాటికి మజ్లిస్, లెఫ్ట్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా గెలిచిన వారి మద్దతుఅవసరం ఉంటుంది. రెండు పార్టీలు ఇప్పటికే ఆ పని మీదున్నాయి. టీ-కాంగ్రెస్ పార్టీ మరొక అడుగు ముందుకు వేసి తెరాస గెలుపు గుర్రాలకు కూడా వలవేస్తోంది. వారిని నియంత్రించడానికే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని సోనియా గాంధీకి మళ్ళీ మస్కా కొట్టే ప్రయత్నం చేసారు.

 

కాంగ్రెస్ అధిష్టానం కేంద్రంలో మళ్ళీ అధికారం దక్కించుకొని రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొందనే విషయం అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ కోసమే సీమాంద్రాలో తన పార్టీని, నేతలని కూడా బలిచేసింది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కన్నట్లు సీమాంధ్రలో, కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోబోతోంది.

 

కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేఅవకాశం లేనప్పుడు ఇక దానికి తెరాస మద్దతు అవసరం కూడా ఉండదు. అటువంటప్పుడు తెరాసకు తెలంగాణాను అప్పగించవలసిన అవసరం కూడా ఉండబోదు. అదేవిధంగా తెరాస మద్దతు స్వీకరించి దానికి అధికారంలో భాగం పంచి ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించకపోవచ్చును. కేవలం కేసీఆర్ దురాశ, అధికార కాంక్ష కారణంగానే కాంగ్రెస్ నేడు తెలంగాణాలో కూడా గెలుపు కోసం పోరాడవలసిన దుస్థితిలో పడింది. అందువల్ల ఈ పరిస్థితికి కారణమయిన కేసీఆర్ తో మళ్ళీ చేతులు కలిపే ఆలోచన చేయకపోవచ్చును. ఎలాగు కేంద్రంలో, సీమాంద్రాలో అధికారం కోల్పోబోతున్నపుడు కనీసం తెలంగాణాలోనయినా అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ ఆశించడం అసహజమేమీ కాదు. అందుకోసం కాంగ్రెస్ ఎంతకయినా తెగించవచ్చును. అవసరమయితే తెరాస యం.యల్యేలకు మంత్రి పదవులు ఎరగా వేసి పార్టీలోకి ఆకర్షించవచ్చును. తప్పనిసరి పరిస్థితుల్లో తెదేపా-బీజేపీ కూటమి మద్దతు కోరవచ్చును. వారు కూడా తెరాసను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక తెరాస అంటే కేసీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పెత్తనమే సాగుతుంది గనుక ఇతర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు ఆసక్తి చూపించవచ్చును. అందువల్ల తెరాస తనంతట తానుగా పూర్తి మెజార్టీ సాధిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేనని చెప్పవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారం దక్కించుకొనే అవకాశాలు ఎక్కువ.

google-ad-img
    Related Sigment News
    • Loading...