ఈ ఐడియా కాంగ్రెస్ కి వర్కవుట్ అవుతుందా
posted on Apr 11, 2014 8:30AM
.jpg)
కాంగ్రెస్ పార్టీలో మిగిలిన రఘువీరా రెడ్డి, చిరంజీవి వంటి నేతలందరూ కూడా పార్టీని వీడి బయటకు పోయినవారందరూ ద్రోహులేనని వారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పాలని ఇంతవరకు పదేపదే కోరారు. కానీ, తమ బస్సుయాత్రకి ప్రజల నుండి బొత్తిగా స్పందన లేకపోవడంతో, వారికి తమ అసలు పరిస్థితి అర్ధమయింది. ఆ తరువాత వారు చిరంజీవి అభిమానులను పోగేసి వారికి కూడా (కాంగ్రెస్) టోపీలు పెట్టేసి, వారంలోగా ఓ పది లక్షల మందిని అర్జెంటుగా పార్టీలో చేర్పించండని హుకుం జారీ చేసారు. కానీ అది కూడా సాధ్యం కాదని తేలిపోయింది. దానితో దిగాలుపడి కూర్చొన్న వారందరికీ కాంగ్రెస్ హైకమండ్ సరికొత్త ఐడియా ఇచ్చింది. అదే పార్టీ నుండి బయటకు వెళ్ళిన పోయిన వారిని మళ్ళీ సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం!
నిన్నటి వరకు తిట్టినా నోటితోనే మళ్ళీ వారిని ఆహ్వానించడం కొంచెం ఇబ్బందికరమే! అయినప్పటికీ, ఇటువంటి చిలిపి చేష్టలు కాంగ్రెస్ వాళ్ళు కాకపోతే మరెవరు చేయలేరని నిరూపిస్తూ, సీమాంధ్రలో పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసిన దిగ్విజయ్ సింఘే ఆ పని మొదలుపెట్టక తప్పలేదు. ఆ ప్రయత్నంలో ఇప్పటికే తమ యంపీ సాయి ప్రతాప్ ని వెనక్కి తెచ్చుకొని, “ఇక మీరు కూడా నాలాగే ప్రయత్నిస్తే తప్పకుండా మిగిలిన వారిని కూడా వెనక్కి రప్పించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు” అని ఆయన తన సీమాంధ్ర కాంగ్రెస్ జీవులకు భరోసా ఇచ్చేరు.
ఆయన పాయింటు అందరి కంటే ముందు క్యాచ్ చేసేసిన కిల్లి రాణీ వారు, “కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీలలోకి వెళ్ళిన వారిలో 99శాతం మంది ఆ పార్టీలలో ఇమడలేక ‘కాంగ్రెస్ సిండ్రోం’ అనే సమస్యతో బాధపడుతున్నారని నాకు తెలుసు. నా శ్రీకాకుళం జిల్లాకు సంబందించిన కాంగ్రెస్ నేతలెవరయినా తిరిగి రాదలుచుకొంటే నేనే స్వయంగా వెళ్లి వారికి బొట్టుపెట్టి సాదరంగా పార్టీలోకి తీసుకువచ్చేందుకు సిద్దంగా ఉన్నాను” అని మీడియా ముందు ప్రకటించేశారు. పార్టీలో మిగిలిన కాంగ్రెస్ జీవులు కూడా ఇంచుమించు ఈవిధంగానే మాట్లాడుతున్నారిప్పుడు.
దాదాపు అన్ని నియోజక వర్గాలకు టికెట్స్ ఖరారయిపోయాయని ఇక ప్రకటన వేలువడటమే ఆలశ్యమని చెపుతూ, ఇంకా ఆలసిస్తే ఆశాభంగం తప్పదని అన్యాపదేశంగా తమ మాజీ కాంగ్రెస్ నేతలకు పదేపదే సందేశాలు పంపుతున్నారు. ఇది చూసి మాజీలు ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడకపోయినా ప్రజలు మాత్రం ‘ఔరా కాంగ్రెస్!’ అని ముక్కున వేలేసుకొంటున్నారు. ఒకవేళ వారు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తే ఇంతకాలం తిట్టిన పార్టీని, తిట్టుకొన్న సహచరులతో ఏవిధంగా కలిసి కాపురం చేస్తారో చూసి తరిద్దామని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరూ వేర్వేరు రంగుల కండువాలు కప్పుకొని వస్తుంటే గుర్తుపట్టలేక తికమక పడుతున్న ప్రజలు కూడా మళ్ళీ వారందరూ ఒక్క గూటికి చేరుకొంటే తమపని సులువయిపోతుందని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అలాగే వారివల్ల టికెట్స్ పోగొట్టుకొన్న ఇతర పార్టీల నేతలు కూడా వారు బయటకు దయచేస్తే కొబ్బరికాయలు కొట్టేందుకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘ఇదంతా జరిగేపనేనా!’ అని అందరూ అపనమ్మకంతోనే ఉన్నారు ఇంకా.