దళిత మంత్రం కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందా?
posted on Apr 4, 2014 9:47AM
.jpg)
చిరంజీవిని పట్టుకొని గోదారి దాటేదామనుకొన్నకాంగ్రెస్ పార్టీకి ఆయన నేతృత్వంలో చేసిన బస్సు యాత్రకి జనాలు కరువవడంతో చాలా నిరాశ చెందింది. జనాల మీదకి మెగాస్త్రం ప్రయోగించినా ఎవరూ సమ్మోహితులు కాలేదు. పైగా ఆ అస్త్రం ధాటికి ఎక్కడా మనుషులు కనబడకుండా మాయమయిపోవడం చూసి, ఆయననే నమ్ముకొన్న అధిష్టాన దేవతలు కలత చెందడం సహజమే. వారి బాధ తమ బాధగా భావించే కొందరు వీరవిధేయ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు మనం కూడా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు బీసీ మంత్రం జపించి తెలంగాణాలో తన పార్టీని ఏవిధంగా ఒడ్డున పడేసుకొన్నాడో అదేవిధంగా సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన మన పార్టీని కూడా ఒడ్డున పడేసేందుకు దళిత మంత్రం పటిస్తే ఏమయినా ఫలితం ఉంటుందేమోనని సూచించారు. దానికి డిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఈ సరికొత్త ఐడియాని ట్రై చేయడానికి సిద్దమయిపోతున్నారు సీమాంద్రాలో (మిగిలిన) కాంగ్రెస్ నేతలు.
చిరంజీవి (ఫ్లాప్) షో వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోయినా ఈ దళిత మంత్రం ఐడియా మాత్రం తమ పార్టీ భవిష్యత్తునే మార్చేస్తుందని గట్టిగా నమ్ముతూ ఈసారి జేడీ శీలంకు స్టీరింగ్ అప్పగించి డొక్కా మాణిక్యవరప్రసాద్, పనబాక, సుధాకర్ తదితర కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఈరోజు హైదరాబాదు నుండి బస్సు యాత్రకు బయలుదేరిపోయారు. అయితే చిరంజీవి ప్రచార కమిటీ చైర్మన్ అయినప్పటికీ ఈసారి ఆయనను వారి వెంట తీసుకువెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సరికొత్త ఐడియాను ప్రయత్నిస్తున్నపుడు ఆయనను వెంట తీసుకువెళ్లడం ఎందుకనుకోన్నారో లేక ఒకవేళ ఈ ఐడియా పనిచేస్తే అది తన మహిమేనని ఆయన ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారని భయపడ్డారో తెలియదు కానీ ఆయనను హైదరాబాద్ లోనే వదిలేసి మిగిలిన నలుగురూ బయలుదేరిపోయారు.
అలాగే క్రిందటి సారి శ్రీకాకుళం నుండి యాత్రలు మొదలుపెడితే అచ్చి రాలేదని భావించారో ఏమో, ఈసారి కర్నూల్ నుండి మొదలు పెట్టబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఐడియా మారింది. డ్రైవర్ మారాడు. బస్సు డైరెక్షన్ కూడా మారింది గనుక ఈసారయినా తప్పకుండా జనాలు వస్తారని వారు ఆశపడుతున్నారు. అసలు జనాలంటూ వస్తే వారిమీద ఏ మంత్రంమైనా తంత్రమైనా ప్రయోగించి వశపరుచుకొనే ప్రయత్నం చేయడానికి వీలుంటుంది.
కానీ ఈసారి బస్సెక్కిన మహానుభావులు అందరూ కూడా అధిష్టానానికి వీరవిధేయులు, రాష్ట్ర విభజనకు తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని గట్టిగా నిలబడినవారే గనుక వారు పాటించే దళిత మంత్రం వినేందుకు జనాలు దొరుకుతారని గ్యారంటీ ఏమీ లేదు. అందువల్ల వీలయితే ఎక్కడికక్కడ తమ అనుచరులనే సిద్దం చేసి ఉంచుకొంటే చివరాఖరుగా మా బస్సు యాత్ర కూడా చిరంజీవి యాత్రలాగే గ్రాండ్ సక్సెస్స్అయ్యిందని చెప్పుకోవచ్చును.