ఈ లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ సరిగా పని చేయడం లేదని అర్థం..!

posted on: Feb 25, 2026 1:44PM


శరీరంలో ఏదైనా వ్యాధి లేక జబ్బు వస్తే.. అది వెంటనే బయటపడకపోయినా.. శరీరం మాత్రం వాటికి సంబంధించి సంకేతాలు ఇస్తూనే ఉంటుంది.  వీటినే ఆయా జబ్బుకు సంబంధించిన లక్షణాలు అంటుంటాం.  శరీరం పదే పదే  సంకేతాలు ఇస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా  థైరాయిడ్ పనిచేయకపోవడం కూడా అలాంటి సమస్యే.. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే  సమస్య నెమ్మదిగా పెరుగుతూ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉన్న ఒక చిన్న, సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సరిగ్గా పనిచేయనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలో.. ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో తెలుసుకుంటే..

చలిగా అనిపించడం..

వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ,  ఇతరులకన్నా చల్లగా అనిపిస్తే అది  జీవక్రియ మందగిస్తున్నదానికి సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చల్లగా అనిపిస్తుంది.

ఏకాగ్రత..

తరచుగా మరచిపోవడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం లేదా నీరసంగా అనిపించడం కూడా థైరాయిడ్ వ్యాధికి  సంకేతాలు కావచ్చట.  ఇది హార్మోన్ల అసమతుల్యత మానసిక పనితీరును ప్రభావితం చేస్తుంది.

నెలసరి సమస్యలు..

స్త్రీలలో, అధికంగా లేదా  క్రమరహిత ఋతుస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం థైరాయిడ్ సమస్యతో ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత నేరుగా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది.

బరువు పెరగడం..

 ఆహారంలో ఎటువంటి  మార్పులు చేయకపోయినా  బరువు పెరుగుతున్నట్లయితే, అది నెమ్మదిగా జీవక్రియ జరుగుతుందనడానికి సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, శరీరం కేలరీలను చాలా నెమ్మదిగా బర్న్ చేస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు.

చర్మం..

నిస్తేజంగా,  పొడిబారిన చర్మం, గరుకుగా ఉండే జుట్టు కూడా థైరాయిడ్ అసమతుల్యతను సూచిస్తుంది.

ఎవరికి థైరాయిడ్ వ్యాధులు ప్రమాదం  ఉంటుంది?

 ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి థైరాయిడ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉంటే వారికి  ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. తల లేదా మెడకు రేడియేషన్ థెరపీ పొందిన లేదా అధిక మొత్తంలో అయోడిన్ ఉన్న మందులు తీసుకుంటున్న టర్నర్ సిండ్రోమ్ ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి.

వైద్యుడిని ఎప్పుడు కలవాలి..

పైన చెప్పుకున్న లక్షణాలు చాలా వారాల పాటు కొనసాగితే లేదా క్రమంగా పెరిగితే, TSH, T3,  T4  రక్త పరీక్షలు చేయించుకోవాలి. చికిత్సను ముందుగానే ప్రారంభిస్తే థైరాయిడ్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. థైరాయిడ్ వ్యాధి సాధారణం, కానీ వెంటనే గుర్తించి చికిత్స చేయకపోతే అది  గుండె, బరువు, మానసిక ఆరోగ్యం,  సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల శరీరం ఇచ్చే సంకేతాలను తేలికగా తీసుకోకూడదు.  వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవాలి.

                        *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

google-ad-img
    Related Sigment News
    • Loading...