దేశం పిలుస్తోంది.. రా.. కదలిరా.. ఇండియన్ అమెరికన్స్ కు శ్రీధర్ వేంబు పిలుపు

posted on: Apr 29, 2026 2:48PM

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో భారతీయుల ప్రతిభ వెలుగులీనుతున్న వేళ..  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో  సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. అమెరికాలో స్థిరపడిన భారతీయ మేధావులు, సాంకేతిక నిపుణులు తమ మాతృభూమికి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.  భారతమాతకు మీ ప్రతిభ అవసరం  అంటూ ఆయన రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు అటు అమెరికాలోని ప్రవాసులలో, ఇటు స్వదేశంలోని యువతలో  కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

శ్రీధర్ వేంబు తన లేఖలో ప్రధానంగా భారతీయుల ఆత్మగౌరవాన్ని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో భారతీయులకు లభించే గౌరవం అనేది కేవలం వారి వ్యక్తిగత విజయాలపై మాత్రమే కాకుండా..  మాతృదేశం ఎంతటి సాంకేతిక, ఆర్థిక శక్తిగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం తాను కూడా ఖాళీ చేతులతో అమెరికా వెళ్ళిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆ దేశం తమకు ఎన్నో అవకాశాలను ఇచ్చిందని కృతజ్ఞతను చాటుకున్నారు. అయితే..  ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనీ, అమెరికాలోని స్థానిక రాజకీయ పరిణామాలు భారతీయుల భద్రతను,  భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేస్తున్నాయని  హెచ్చరించారు.

ఇటీవల వెలువడిన కార్నెగీ ఎండోమెంట్ - యూగవ్ సర్వే ఫలితాలు కూడా వేంబు వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి.  అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన దాదాపు 40 శాతం మంది  అక్కడ శాశ్వతంగా ఉండటానికి ఆసక్తి చూపడం లేదనీ..  తిరిగి స్వదేశానికి రావాలని లేదా ఇతర దేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణాలుగా అమెరికాలోని పెరిగిన జీవన వ్యయం, అద్దెలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో పాటు పెరుగుతున్న జాతి వివక్ష,  వలస వ్యతిరేక ధోరణులను ఆ నివేదిక ఎత్తిచూపింది. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి నిరీక్షణ, హెచ్-1బీ వీసా నిబంధనల్లో అనిశ్చితి వంటివి ప్రవాసులలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి.

వేంబు తన విశ్లేషణలో అమెరికా రాజకీయాలలోని హార్డ్ రైట్ మరియు  వోక్ లెఫ్ట్ సిద్ధాంతాల మధ్య భారతీయులు చిక్కుకుపోయారని అభిప్రాయపడ్డారు. భారత సంస్కృతిని, నాగరికతను ద్వేషించే శక్తుల మధ్య ప్రవాస భారతీయులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఆర్థికంగా బలహీనంగా ఉన్నంత కాలం పాశ్చాత్య దేశాలు..  మనని తృణీకారంతో చూస్తాయని..  ఒకవేళ మనం అభివృద్ధి చెందితే అది వారి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని భయపడతాయని శ్రీధర్ వేంబు విశ్లేషించారు. అందుకే, భారత్ తన సొంత సాంకేతిక శక్తిని పెంచుకోవాలని, దానికి విదేశాల్లో ఉన్న అనుభవజ్ఞులైన మేధావుల సహకారం  అత్యవసరమన్నారు.  

భారతదేశంలో ప్రస్తుతం పుంజుకుంటున్న స్టార్టప్ ఎకోసిస్టమ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు,  సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాల్లో వస్తున్న మార్పులను తన లేఖలో శ్రీధర్ వేంబు ఉదహరించారు. అమెరికాలోని మేధావులు తిరిగి వస్తే.. భారత యువతకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని, తద్వారా దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనినే  రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్  గా ఆయన అభివర్ణించారు. గతంలో ప్రతిభ బయటకు వెళ్లిపోయేది (మేదో వలస)..  ఇప్పుడు ఆ ప్రతిభ మళ్ళీ స్వదేశానికి తిరిగి రావాల్సిన సమయం వచ్చిందని గట్టిగా చెబుతున్నారు. 

అయితే..  అమెరికా నుంచి తిరిగి రావడం అనేది ఒక భావోద్వేగ నిర్ణయం మాత్రమే కాదు..  అది అనేక   సవాళ్లతో కూడుకున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పిల్లల విద్యా వ్యవస్థలో మార్పులు, భాగస్వామి కెరీర్,  దేశంలోని ట్రాఫిక్, కాలుష్యం, రెడ్ టేపిజం,  వంటి సమస్యలు ప్రవాసులను కొంత వెనక్కి నెడుతున్నాయి. శ్రీధర్ వేంబు పిలుపు సాకారం కావాలంటే..  మేధావుల ఆలోచనా విధానం మారడమే కాకుండా.. ప్రభుత్వం కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలను, జీవన ప్రమాణాలను మెరుగుపరచాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన నిపుణులు ఇక్కడ స్థిరపడేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉందని శ్రీధర్ వేంబు అంటున్నారు.

  శ్రీధర్ వేంబు పిలుపు ఒక సీరియస్  చర్చకు దారితీసింది. ఇది కేవలం జీతాలు లేదా ఉద్యోగాల గురించి కాదు, మన గుర్తింపు,  ఆత్మగౌరవం గురించే కాకుండా..   అమెరికన్ డ్రీమ్ కంటే ఇండియన్ డ్రీమ్ గొప్పదని నిరూపించే బాధ్యత ప్రవాస భారతీయులపై ఉందన్నది శ్రీధర్ వేంబు లేఖ సారాంశం.  రాబోయే రోజుల్లో ఎంతమంది మేధావులు మాతృభూమి పిలుపును అందుకుని తిరిగి వస్తారో చూడాలి. భారతదేశం నిజమైన ప్రపంచ శక్తిగా ఎదగాలంటే, మేధో వలసలు ఆగి, మేధో సంపత్తి స్వదేశానికి తరలిరావడమే ఏకైక మార్గం.

-సీతారాం కంఠంనేని

references

1.    https://www.msn.com/en-in/news/insight/sridhar-vembu-urges-us-based-indians-to-return-amid-rising-tensions/gm-GM2C8950D7 
2.    https://economictimes.indiatimes.com/news/new-updates/zohos-sridhar-vembu-requests-indians-in-us-for-ghar-vaapsi-amid-trumps-hellhole-row-says-its-the-only-path-to-true-respect/articleshow/130544687.cms 
3.    https://startuptalky.com/sridhar-vembu-come-back-home-indians-us-return/ 
4.    https://www.timesnownews.com/india/zoho-founder-sridhar-vembu-urges-indians-in-america-to-return-bharat-mata-needs-your-talent-article-154177708 
5.    https://www.tice.news/politeco/sridhar-vembus-open-letter-to-indian-diaspora-a-call-to-return-and-rebuild-bharat-11771336 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి  తెలుగువన్ ను ఫాలో అవ్వండి, షేర్ చేయండి 

google-ad-img
    Related Sigment News
    • Loading...