తెలంగాణపై చలిపులి పంజా

తెలంగాణను కోల్డ్ వేవ్ కమ్మేసింది. నిన్నమొన్నటి వరకూ ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన జనం ఇప్పుడు చలి పులి పంజాకు చిక్కుకుని గజగజలాడుతున్నారు.  తెలంగాణలో నాలుగైదు రోజులలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల వరకూ పడిపోతున్నాయి. రానున్న రెండు రోజులలో చలితీవ్రత మరింత అధికమౌతుందంటున్నది వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది.   చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు  జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.    ఈ  నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  

చలి తీవ్రత రానున్న రెండు మూడు రోజుల్లో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లో చలి మరీ అధికంగా ఉంది. ఆదివారం రాత్రి శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గ్రేటర్‌ పరిధిలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత.

రానున్న రెండు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చలి తీవ్రత మరీ అధికంగా ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ లో ఆదివారం రాత్రి అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీలు రికార్డయ్యింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu