దాసరికి ఇది పద్ధతేనా?
posted on Jun 30, 2015 9:57PM

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గతంలో మంచి మంచి సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన ఈమధ్యకాలంలో వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన దర్శకుడిగా ఒక లెజెండ్. శతాధిక చిత్ర దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి అంతర్జాతీయ గౌరవం తెచ్చిన దర్శకుడు. తెలుగు సినిమా రంగం భారతీయ సినిమా రంగం ముందు తలెత్తుకుని నిలబడే విధంగా సినిమాలు తీసిన దర్శకుడు. అంతవరకూ ఓకే.. రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఆయన వైఖరి, వ్యవహారశైలి ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు రాజకీయంగా ఎంత సేవ చేశారో తెలుగు ప్రజలకు ఒక్క ముక్క కూడా తెలియదుగానీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ మాత్రం ఆయన చేసిన ‘సేవను’ గుర్తించేసి ఆయనకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీ పదవి, ఒకసారి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు.
సరే, ఆయనకు పదవులు ఎందుకు ఇచ్చారన్న విషయం పక్కన పెడితే, బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఆయన పనిచేసిన తీరు మాత్రం అక్షేపణీయం అయింది. బొగ్గు క్షేత్రాల కుంభకోణంలో ఆయన పాత్ర కూడా వుందని, ఆయన అవినీతికి పాల్పడినందువల్లే ఆయనకు చెందిన సంస్థలో ఆయన ద్వారా లాభం పొందిన వారు పెట్టుబడులు పెట్టారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలు. ఈ విషయంలో సీబీఐ దాసరి నారాయణరావుతోపాటు మొత్తం 14 మంది మీద చార్జిషీటు దాఖలు చేసింది. సాక్షాత్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కూడా సీబీఐ విచారించింది. తాజాగా దాసరి నారాయణరావును మరోసారి సీబీఐ విచారించింది. ఆయన మంగళవారం నాడు ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరై తన వాదన వినిపించారు. కుంభకోణంతో తనకు ఎంతమాత్రం ప్రమేయం లేదని, ప్రధానికి తెలియకుండా తానేమీ చేయలేదని, తాను కేవలం సహాయమంత్రిగానే పనిచేశానని, బొగ్గు శాఖకు ప్రధానమంత్రే ఇన్‌ఛార్జ్ మంత్రిగా వున్నారని చెప్పారు. ఇది దాసరి ఈ కేసును పూర్తిగా మన్మోహన్ సింగ్ మీదకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీకులకులు అంటున్నారు. కేంద్ర మంత్రిగా హోదా అనుభవించిన దాసరి ఇప్పుడు కేసుల విషయానికి వచ్చేసరికి తనకెంతమాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణమని అంటున్నారు.