కార్మిక వ‌ర్గానికి సీఎం రేవంత్ మేడే శుభాకాంక్ష‌లు

posted on: Apr 30, 2026 8:54PM

 

మే డే (మే 1వ తేదీ) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్ర‌త్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మిక వ‌ర్గ‌ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న‌ట్టు  పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌లో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని స్ప‌ష్టం చేశారు. శ్రామికులే త‌మ ప్ర‌భుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని చెప్పారు. 

కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి ప్ర‌జా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. మే డే స్ఫూర్తితో  రాష్ట్ర‌ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంద‌న్నారు. రాష్ట్రంలో ప్రజా ప్ర‌భుత్వం అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామ‌న్నారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ బిల్లు తీసుకువ‌చ్చిన‌ట్టు తెలిపారు.

కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని సీఎం పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించడం జరిగిందన్నారు. 

సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్ ఇచ్చిన‌ట్టు గుర్తు చేశారు. దాంతోపాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన‌ట్టు వివ‌రించారు. గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా.. వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...