కొత్త ఎయిర్‌పోర్టుల అనుమతి కోసం సీఎం రేవంత్ వినతి
posted on: Feb 12, 2026 3:52PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టుల అభివృద్ధి కోసం అవసరమైన అనుమతులు, సహాయం కోరారు సీఎం. ఈ భేటీలో మామునూరు , కొత్తగూడెం, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. మామునూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తి కావడంతో, అవసరమైన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతి చేశారు.
అలాగే, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ కోసం పాల్వంచలో స్థలం గుర్తించినందున, ఆబ్‌స్ట్రక్షన్ లిమిట్ సర్వే (OLS), ఫీజిబిలిటీ స్టడీలు త్వరగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్‌పోర్ట్ కోసం ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినట్లు తెలిపిన సీఎం.. వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ విషయంలో అదనంగా 249.82 ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉందని సీఎం తెలియజేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని సంవత్సరంలో పూర్తి చేసి, ఎయిర్‌బస్ సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






