సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం నో.. అసలు కారణమేంటంటే..!

posted on: Aug 21, 2026 5:46PM

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను కేంద్రం అధికారికంగా వెల్లడించింది.

కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రులు లేదా ఇతర ఉన్నతాధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో వారి షెడ్యూల్, పర్యటన ఉద్దేశాన్ని నిశితంగా పరిశీలిస్తామని తెలిపారు. పదవి హోదాకు తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సాధారణంగా విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చే క్రమంలో పాటించే ప్రామాణిక నిబంధనలను ఈ విషయంలో కూడా అనుసరించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ షెడ్యూల్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల అనుమతి ఇవ్వలేదని, అయితే ఆయన బ్రిటన్ పర్యటనకు ముందే క్లియరెన్స్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లి ఆగస్టు 30 నాటికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. 'తెలంగాణ రైజింగ్' బృందంతో కలిసి పలువురు ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడిదారులతో సమావేశమయ్యేందుకు ఈ పర్యటనను ప్రతిపాదించారు. అయితే కేంద్రం అనుమతి నిరాకరించడంతో ఈ పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రకటించింది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధమైన సమయంలో కేంద్రం అనుమతి నిరాకరించడం సరికాదని అధికార పక్షం భావిస్తుండగా, పర్యటన నిబంధనల ప్రకారమే విదేశాంగ శాఖ వ్యవహరించిందని మరోపక్క అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూఎస్ టూర్ రద్దు కావడంతో లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణీత సమయం కంటే ముందే హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కేంద్రం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీనిపై రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది వేచి చూడాల్సి ఉంది.


CM Revanth Reddy US Trip, MEA Clear Statement Revanth Reddy, Telangana CM USA Tour Cancelled, Randhir Jaiswal MEA, Telangana Political News
 

google-ad-img
    Related Sigment News
    • Loading...