Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ నిప్పులు..వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి..!
posted on: Jul 4, 2026 7:26PM
.webp)
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు. నాడు స్థానిక ప్రజలు నాటిన చిన్న మొక్కే, నేడు రాష్ట్రంలో ఒక మహా వృక్షంగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 2006 జూలై 4వ తేదీన మిడ్జిల్ ప్రాంత ప్రజలు అందించిన ఆశీస్సులే తనను ఈ స్థాయికి చేర్చాయని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
తన రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటూ, నాటి పాలమూరు జిల్లా వెనుకబాటుతనాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో ఈ ప్రాంతం తీవ్రమైన కరువుతో, 'డార్క్ మండలాలు'గా వర్గీకరించబడి ఉండేదని వివరించారు. తాను స్థానికేతరుడైనప్పటికీ కేవలం నమ్మకంతోనే నాటి ఎన్నికల్లో స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించి, తన ఎదుగుదలకు పునాది వేసిన మిడ్జిల్, కల్వకుర్తి ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు.
పాలమూరు మట్టి గొప్పతనాన్ని వివరిస్తూ నాటి హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వంటి మహామహులు ఈ గడ్డపై నుంచే దేశానికి సేవలందించారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే వెనుకబడిన మిడ్జిల్ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే ఈ మండలాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయించాలని సభాముఖంగానే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సీఎం కోరారు.
మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో పేదలకు సొంత ఇళ్లు ఇవ్వకుండా గాలికొదిలేశారని, తమ పాలనలో ప్రతి గ్రామంలో 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మించి పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని వివరించారు.
గత పాలకుల హయాంలో జరిగిన దోపిడీ వల్లే రాష్ట్ర అప్పులు రూ. 70 వేల కోట్ల నుండి ఏకంగా రూ. 8.50 లక్షల కోట్లకు చేరాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులకు వేల కోట్ల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్ వంటి ప్రజా గాయకుడిని సైతం నాటి దొరలు గడీల ముందు గంటల తరబడి నిలబెట్టి అవమానించారని మండిపడ్డారు.
ఈ కృతజ్ఞత సభ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సాధారణ స్వతంత్ర జడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుండి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి కెరీర్ గ్రాఫ్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్వయంగా ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టడం, డిప్యూటీ సీఎం దత్తత అంశాన్ని ప్రస్తావించడంతో రాబోయే రోజుల్లో మిడ్జిల్ మండలానికి కొత్త నిధులు, మౌలిక వసతులు సమకూరుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


.webp)



