TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే?

Published on: Wed Apr 23, 2025 8:10PM

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా బీజేపీ నేత కాసం కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ  రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.