ఊరూరా బెల్ట్ షాపులు తెచ్చి కేసీఆర్ తాగుడు కల్చర్ పెంచారు : సీఎం రేవంత్

posted on: Jun 30, 2026 7:59PM

 

 

శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల...

తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిల్పాకళా వేదిక వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ అనుసరించిన విధానాలపై రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించి కేవలం తాగుడు సంస్కృతిని మాత్రమే ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజున దాదాపు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,482.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా జమ చేశారు. ఒక ఎకరం లోపు ఉన్న 14.65 లక్షల మంది రైతులకు, అలాగే రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతులకు వర్షాకాలం సాగు పనులు ప్రారంభమయ్యే సమయానికే ఈ పెట్టుబడి సాయాన్ని అందించినట్లు సీఎం వివరించారు.

గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన 19 మంది ముఖ్యమంత్రులు చేసిన మొత్తం అప్పు కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమేనని, కానీ కేసీఆర్ ఒంటరిగానే తెలంగాణను రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని సీఎం ఆరోపించారు. తాము అధికారంలోకి రాకముందు ఆరు లక్షల కోట్ల అప్పులు ఉంటాయని భావించామని, కానీ తీరా బాధ్యతలు చేపట్టాక లెక్కలు చూస్తే కొండలంత అప్పులు బయటపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి పాఠశాల విద్యార్థుల భోజన బిల్లులు, సర్పంచుల నిధులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారని మండిపడ్డారు.

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఆ ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే 'కూలేశ్వరం'గా మారిందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా, బోర్ల కింద రైతులు పండించిన పంటను కూడా తమ ఖాతాలో వేసుకుని గత పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ వరి సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.

గత పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీఎం ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.22,600 కోట్ల మేర రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్ హక్కని, సాగుకు నిరంతర విద్యుత్ కోసం ఇప్పటికే రూ.36 వేల కోట్లు చెల్లించామని ఆయన వెల్లడించారు.

తాము తప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో దాక్కోవడం లేదని, కేసీఆర్ చేసిన పాపాలను, అప్పులను తీరుస్తూ ప్రజల మధ్యే ధైర్యంగా తిరుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రైతు సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...