రైతు భరోసా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

posted on: Jun 18, 2026 8:50PM

 

వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే భారీ రైతు సమ్మేళనంలో రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఏడు రకాల సన్న ధాన్యానికే బోనస్

సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే బోనస్‌ను ఏడు రకాల వరి వంగడాలకు మాత్రమే వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ అందజేయనున్నారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి విజ్ఞప్తి

ఈ ఏడాది తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్రం నిర్దేశించే కనీస మద్దతు ధర (MSP), కొనుగోలు విధానాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోళ్లు కొనసాగించాలని నిర్ణయించింది.

ఎరువుల కోటా వెంటనే విడుదల చేయాలి

వానాకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేసింది. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఎరువుల కొరత సమస్య కూడా నివారించవచ్చని అభిప్రాయపడింది.

ఉపాధి హామీ పథకంపై కేబినెట్ ఆందోళన

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం ప్రతిపాదించిన కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై సమగ్ర అధ్యయనం కోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వివేక్ వెంకటస్వామిలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.

మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన అనుమతులు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా మెట్రో విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ డిజిటల్ కేబినెట్ ప్రారంభం

పేపర్‌లెస్ గవర్నెన్స్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ కేబినెట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై కేబినెట్ సమావేశాల ఎజెండా, నోట్స్ తదితర వివరాలు ప్రత్యేక ట్యాబ్‌ల ద్వారా మంత్రులకు అందుబాటులో ఉంటాయి.

నీట్ అభ్యర్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

ఈ నెల 21న నిర్వహించే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హాల్‌టికెట్ చూపించి విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాల్లో సుమారు 2.95 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...