Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
posted on: Jun 5, 2026 10:01PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పాలమూరు బిడ్డనని పేర్కొన్న సీఎం, గత రెండు రోజులుగా జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించానని తెలిపారు. వలసల కష్టాలు, రైతుల ఆత్మహత్యల బాధలు పాలమూరు ప్రజలకు ఎంతగా తెలిసినవో తనకూ తెలుసని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి, “ఇక ఏ తల్లికి గుండెకోత ఉండకూడదనే ఆలోచనతో సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు” అని పేర్కొన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ, “ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రెండుసార్లు పాలించే అవకాశం ఇచ్చినా పదేళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. రైతులకు సాగునీరు అందలేదు, ప్రజల కష్టాలు తీరలేదు” అని ఆరోపించారు.
“పాలమూరులో గెలిచి గజ్వేల్‌కు వెళ్లిన కేసీఆర్ పాలమూరు ద్రోహినా? లేక పాలమూరు కోసం పని చేస్తున్న నేను ద్రోహినా?” అంటూ ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఉద్దండపూర్ నిర్వాసితుల సమస్యను ప్రస్తావిస్తూ, కాళేశ్వరం కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఉద్దండపూర్ ముంపు బాధితులకు రూ.800 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిర్వాసితులను జైలుకు పంపి వేధించారని ఆరోపించారు.
గత 30 నెలల్లో పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. అలాగే కొడంగల్‌లో భారీ ఎడ్యుకేషన్ హబ్‌ను నిర్మిస్తున్నామని, ఏ కోర్సు చదవాలన్నా పాలమూరుకు వచ్చే పరిస్థితి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.“చదువే జీవితాలను మార్చగలదు. పిల్లలను తప్పనిసరిగా చదివించండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఆమోదించిందని తెలిపారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బహిరంగ సవాల్ విసురుతూ, “మీ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చిద్దాం. అసెంబ్లీకి రండి. మా పాలనలో తప్పు ఉంటే నేను క్షమాపణ చెబుతాను” అని అన్నారు.
గోదావరి జలాల అంశంపై కూడా స్పందించిన సీఎం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును సాధించి తీరుతామని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి కేటాయింపును సాధించడం తన బాధ్యత అని తెలిపారు.“2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం” అని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, “ఔర్ ఏక్ బార్... కాంగ్రెస్ సర్కార్” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.






