Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారే : సీఎం రేవంత్
posted on: May 28, 2026 8:51PM

ఎన్టీఆర్ ప్రాంతీయ నేత కాదు..యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ..
హైదరాబాద్ నగరం నడిబొడ్డున దివంగత ముఖ్యమంత్రి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది స్వయంగా అన్న ఎన్టీఆరేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అలాంటి మహోన్నత నాయకుడి నీడన పెరిగి, ఈ రోజు ఆయనపైనే విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైన నేత కాదని, ఆయన యావత్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ అని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని పెట్టడంపై వస్తున్న విమర్శలను రేవంత్ తీవ్రంగా ఖండించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగానే మైత్రీవనంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించామని, ఒక ముఖ్యమంత్రిగా అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం కలగడం తన జీవితకాల మధురజ్ఞాపకమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయంలో తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తెలంగాణ సమాజానికి, రాజకీయాలకు ఎన్టీఆర్ చేసిన మేలును రేవంత్ రెడ్డి కొనియాడారు. నాడు పాత పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బలహీన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది అన్నగారేనని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, మాధవరెడ్డి వంటి దిగ్గజ నాయకులను తయారు చేసింది ఎన్టీఆర్ కాదా అని ప్రశ్నించారు. భారతదేశ చరిత్రలో అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మాత్రమేనని శ్లాఘించారు.
ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా ఇందిరాగాంధీ ఆశీస్సులు, ఎన్టీఆర్ ఆశయాల కలయికతోనే సాగుతోందని సీఎం వివరించారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకాలే.. నేటి సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరల పథకాలకు పునాదులని పేర్కొన్నారు. నాడు ఇందిరమ్మ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం శ్రమిస్తే.. ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాల (బీసీ) అభ్యున్నతికి తోడ్పడ్డారని, వారి వల్లనే నేడు ఆయా వర్గాల వారు పాలకులుగా ఎదిగారని రేవంత్ తెలిపారు.
తెలంగాణలో రాబోయే పదేళ్లూ కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని, హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన తరహాలోనే.. తమ ప్రభుత్వం సుమారు 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని నిర్మించి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలుపుతుందని రేవంత్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.






