దమ్ముంటే రండి...2029 ఎన్నికల్లో తేల్చుకుందాం...రేవంత్ సవాల్

posted on: Apr 20, 2026 9:18PM

 

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు వైఫల్యాలపై తనదైన శైలిలో స్పందించిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభావేదిక పైనుంచి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన తొలిపార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీఎం మండిపడ్డారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు, నాణ్యత లోపం కారణంగా అతి తక్కువ కాలంలోనే ‘కూలేశ్వరం’గా మారిందని విమర్శించారు. తెలంగాణను పదేళ్ల పాటు దోచుకున్న కేసీఆర్‌పై కఠిన చర్యలు తప్పవని, ఆయన చేసిన అరాచకాలకు తగిన శిక్ష పడాలని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి లభించడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోయారని, ఆ కుట్రతోనే ఆయన పార్టీ మారారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చినా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వీడటం శోచనీయమన్నారు.

కేసీఆర్ కుటుంబం మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉందని, అది ఎప్పటికీ సాధ్యం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామని సవాల్ విసిరారు. అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి మారతారో చూస్తానని ఎద్దేవా చేశారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పార్టీ ఎలా బలోపేతం అయిందో గుర్తు చేస్తూ, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తానని కార్యకర్తల సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తు చేశామని, రాబోయే రోజుల్లోనూ అదే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచాయి. ప్రాజెక్టుల వివాదం మరియు నేతల వలసల అంశం రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఘర్షణకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...