Latest News

ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు! : సీఎం రేవంత్

posted on: Mar 20, 2026 6:20PM

 

తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, పరిపాలనా పారదర్శకత, వివాదాస్పద కేసులపై దర్యాప్తు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడబోదని ఆయన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురాను న్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రత్యేక విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడి యట్‌ వరకు ఒకే విధానాన్ని ప్రవేశపెడతామని, విద్యార్థులపై ఉండే పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 

విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, చట్టపరమైన ప్రక్రియల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సీఎం పేర్కొన్నారు. ఎలాంటి కక్ష సాధింపు లేకుండా న్యాయపరమైన ఆధారాల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ జరుగుతున్న సమయంలో తాను ప్రత్యక్షంగా సమీక్ష చేయడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు కు ఎలాంటి క్లీన్ చిట్ లభించలేదని సీఎం స్పష్టం చేశారు. చక్రధర్ గౌడ్ కేసులో కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించినా, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో మాత్రం ఎలాంటి ఉపశమనం లేదని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను సీఎం కొట్టిపారేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విస్తరణ కోసమే అన్న ప్రచారం సరికాదని పేర్కొన్నారు. సరైన సమయంలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను   ఎమ్మెల్సీగా నియమించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ వద్ద తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించినట్లు ఆయన వెల్లడించారు. మూసి నది ప్రక్షాళన ప్రాజెక్టుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పేర్కొన్నారు. ప్రాజెక్టు కారణంగా ఇబ్బంది పడే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మూసి పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరమని, నదిని అదే ప్రదేశంలో కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం, గత పదేళ్లలో చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందని వ్యాఖ్యానించారు. 

అప్పులపై వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, గత పాలకులు తమ తప్పులకు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఫార్ములా ఈ రేసు కేసుపై కూడా సీఎం స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్నతాధికారి అరవింద్ కుమార్  ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీసులు త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు. హెల్త్ పాలసీపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం ఖండించారు. సంబంధిత భూమిని విక్రయించినా ప్రచారంలో ఉన్నంత మొత్తంలో నిధులు రాబట్టలేమని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కూడా సీఎం స్పందించారు. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. ప్రతిపక్షాల్లా తప్పుడు ప్రచారాలు చేయబోమని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం టెలరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఇతర రాజకీయ అంశాలపై స్పందిస్తూ, జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ స్థాయిలోనే పరిష్కరిస్తారని, ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరియు ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్  పరిశీలిస్తున్నారని తెలిపారు. అలాగే మహాత్మా గాంధీ  ఎవరి సొత్తు కాదని, ఆయన ఆలోచనలు సమాజానికే చెందాయని వ్యాఖ్యానించారు. మొత్తం మీద రాష్ట్రంలో పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు సూత్రాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...