నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష : సీఎం రేవంత్
posted on: Feb 9, 2026 4:31PM

నిధుల పంపిణీ విషయంలో కేంద్రం దక్షిణాదిపై పక్షపాతం చూపుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాదిలోని కుంభమేళా, సబర్మతి రివర్ ఫ్రంట్, యమునానది వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఇస్తూ, తెలంగాణకు మూసీ నదికి మాత్రం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే, తిరిగి రాష్ట్రానికి కేవలం 45 పైసలే వస్తున్నాయని విమర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, మహబూబ్ నగర్‌కు ఎన్నికల ప్రచారానికి వచ్చి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని రేవంత్‌రెడ్డి అన్నారు.
మూడు సార్లు ప్రధానిగా గెలిచి కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా మోదీని చూసి మళ్ళీ ఓటు వేయాలని జాతీయ అధ్యక్షుడు అడుగుతున్నాడని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోందని ఆయన తెలిపారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2014లో పాలమూరు సభలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పట్టణ ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.
హైదరాబాద్ వరదల సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామంటూ ఓటర్లను మోసం చేస్తున్నారని, రాష్ట్రం చెల్లించే పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కూడా సరిగా ఇవ్వడం లేదని లెక్కలతో వివరించారు. దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తీసుకురాలేదని, మెట్రో, మూసీ, సమ్మక్క సారక్క జాతర వంటి అంశాలకు ప్రత్యేక నిధులు తెచ్చలేదని విమర్శించారు.
ఖమ్మం వరదలు, వరంగల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ వంటి వాటికీ కేంద్రం నుంచి అదనపు సాయం రాలేదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోనే సమస్యలు పెరిగాయని, ఇప్పుడు అదే పార్టీ మళ్లీ ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. బీజేపీ–బీఆరెస్ మధ్య గతంలో విడదీయలేని అనుబంధం ఉందని, రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో మాత్రం ఆ బంధాన్ని ఉపయోగించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సమయానికి ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి చర్యలు చేపట్టామని వివరించారు. పన్నెండేళ్ల మోదీ పాలన, పదేళ్ల బీఆరెస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పోల్చుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని, మరో ఎనిమిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, అభివృద్ధి బాధ్యత తమదేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






