ఓ పాటకాలం మనిషి...పాడిమోసిన నేటికాలం మనిషి
posted on Nov 12, 2025 10:43AM
.webp)
ఈ మధ్యకాలంలో ఒక ముఖ్యమంత్రి పాడె మోసిన ఘటన అరుదనే చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ఈ విషయంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని చెప్పాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ జమానాలో కొందరు నాయకులు అకస్మాత్ మరణం పాలైతే.. వారికి కనీసం రాజలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు.
అలాంటిది నేడు తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన అందెశ్రీకి భారీ ఎత్తున గౌరవం లభించిందనే చెప్పాలి. ఆయన తాను రచించిన రాష్ట్రగీతం జనం నోళ్లలో నానడం మాత్రమే కాదు.. ఆయన కంటి ముందు ప్రభుత్వ ఆమోదం పొందింది. ఆపై ఇందుకుగానూ కోటి రూపాయల నజరానా సైతం లభించింది.
ఇవే ఆయన తన జీవిత కాలంలో చూసిన అత్యున్నతాలనుకుంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన పాడె భుజానికెత్తుకుని మోసి.. గొప్ప సహృదయత చాటుకోవడంతో ఇదొక చర్చనీయాంశంగా మారింది.
నువ్వు చరిత్రలో నిలిచిపోతావు రేవంతన్నా! అంటూ మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు అందెశ్రీ కోసంగానూ ఒక స్మృతి వనం సైతం ఏర్పాటు చేసే దిశగా రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆహా ఓహో అని చెప్పుకుంటున్నారు తెలంగాణ వాసులు.
మాములుగా అయితే అందెశ్రీ రాసిన రచనలు ఏమంత ఎక్కువగా ఉండవు. చాలా చాలా పరిమితంగా మాత్రమే ఉంటాయి ఆయన గేయాలు. కానీ, ఇక్కడ గొప్పదనం ఏంటంటే.. ఆయన రచనల్లో రాశి లేక పోయినా వాసి ఎక్కువ. తక్కువే రాసిన అది జనం మాట పాటగా వచ్చిన అరుదైన బాణీ. అంతే కాదు తెలంగాణ ఉద్యమ కాలంలో తీవ్ర ప్రభావితం చేసింది ఆయన సాహిత్యం.
ఇక రాష్ట్ర గీతమే రాయడంతో.. ఆయనకు ఎక్కడా లేని ప్రాధాన్యత లభించింది. అలాగని గత ప్రభుత్వం ఆయన్ను అక్కున చేర్చుకోలేదు సరికదా పక్కన పెట్టేసింది. ఇది గుర్తించిన రేవంత్ నేతృత్వంలోని నేటి తెలంగాణ ప్రభుత్వం అందెశ్రీ గీతాన్ని ఆమోదించడంతో పాటు ఇదిగో పరి పరి విధాలుగా ఆయన్ను గుర్తించి గౌరవించడంతో.. ఇది సాహితీ చరిత్రలో నిలిచిపోయే ఒకానొక సువర్ణ అధ్యాయంగా భావిస్తున్నారంతా.