Latest News
హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం
posted on: Mar 12, 2026 2:04PM
.webp)
నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ స్టూడియో ద్వారా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా, భారత్‌లో ఇది రెండోది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…తనకు సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పారు. తన బాల్యం నుంచి ఇప్పటివరకు సినీ పరిశ్రమలో అనేక మార్పులు జరిగాయని పేర్కొన్నారు. బాహుబలి, కల్కి, ఆర్‌ఆర్‌ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతతో కూడిన సినిమాలు రావడం భారతీయ సినిమాకు గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు.చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు తీసుకొచ్చారని గుర్తుచేశారు.నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు రావడం అంటే హాలీవుడ్ వచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. తాము హాలీవుడ్‌పై దృష్టి పెట్టామని గతంలోనే చెప్పానని తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ రాకతో తన కల నిజం కాబోతోందని చెప్పారు. ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతోందని, భవిష్యత్‌లో మీ విస్తరణ కోసం ఫ్యూచర్ సిటీలో పెద్ద కార్యాలయం నిర్మించడానికి అవసరమైన భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌ను ఫ్యూచర్ సిటీకే తీసుకురావాలని కోరారు. ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని, తెలంగాణ అంటేనే వ్యాపారం అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


.webp)



