టీడీపీలో ఒంటరి పోరు... కాంగ్రెస్‌‌లో అనైక్యత... కేసీఆర్‌కి కలిసొస్తున్న గందరగోళం

ఒకరు తిడతారు....మరొకరు పొగుడుతారు. ఒకరు ప్రభుత్వంతో చెడుగుడు ఆడేస్తారు...మరొకరు శాలువాలతో సన్మానిస్తారు. ఒకరు దండకాలు చదివితే...మరొకరు దండలు వేస్తారు. ఇదీ తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీల పరిస్థితి. రిజర్వేషన్ల బిల్లు సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. జీవన్‌రెడ్డి దెబ్బకు కేసీఆర్‌ సైతం కంగుతిన్నారు. పాయింట్‌ టు పాయింట్‌ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌‌ను కార్నర్‌ చేశారు జీవన్‌రెడ్డి, అయితే బిల్లు ఆమోదం తర్వాత అదే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్ మాత్రం కేసీఆర్‌ను కలిసి శాలువా కప్పి అభినందించారు. కాంగ్రెస్‌లో ఇలాంటి సీన్లు కొత్తేమీ కాదు. గతంలోనూ హస్తం నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడితే... సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారంటూ తుస్సుమనిపించేవారు.

 

టీడీపీ నాయకులు కూడా హస్తం నేతల బాటలోనే నడున్నారు. సేమ్‌ టు సేమ్‌ కాంగ్రెస్‌లోని పరిస్థితే తెలంగాణ తెలుగుదేశంలోనూ కనిపిస్తోంది. ఒకరు కేసీఆర్ సర్కార్‌పై రంకెలేస్తుంటే.... మరొకరు భేష్ అంటున్నారు. రిజర్వేషన్ల బిల్లుపై రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు పరస్పరం విరుద్ధంగా స్పందించడమే అందుకు రుజువు. ఇక అధికార పార్టీపై పోరాటానికి ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ ముందుకు రావడం లేదు. ఎప్పుడు చూసినా రేవంత్‌రెడ్డి, అప్పుడప్పుడూ ఎల్ రమణ మాత్రమే యుద్ధ క్షేత్రంలో కనిపిస్తున్నారు. మిగతావారు అధికార పార్టీకి వ్యతిరేకంగా నోరు విప్పడం చాలా అరుదుగా కనిస్తోంది.

 

2019లో అధికారం మాదే అంటున్న ఈ రెండు విపక్ష పార్టీల్లో ఎందుకీ గందరగోళం?. అధికారం కోసం అర్రులు చాస్తూనే... ఆ కలలు కల్లలయ్యే పరిస్థితి వారే తెచ్చుకుంటున్నారా?. నాయకులే కన్ఫ్యూజ్ అవుతూ అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుంటే, ఇక కేడర్‌ సంగతి ఏంటి?. ఈ ప్రశ్నలకు ఆ రెండు పార్టీలే సమాధానాలు వెతుక్కోవాలి. అయితే కాంగ్రెస్‌, టీడీపీలు.... అధికార పార్టీ ట్రాప్ లో పడిపోతున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో సమన్వయం లేకపోవడం, మరో విపక్షం టీడీపీలో ఒంటరి పోరు.... టీఆర్‌ఎస్‌కి కలిసొస్తున్నాయంటున్నారు.