ఒకే నాలికతో ఎన్ని మాటలో...
posted on Apr 30, 2015 6:28PM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న హైదరాబాద్ లో జరిగిన తెరాస బహిరంగ సభలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చాలా చులకనగా మాట్లాడి మళ్ళీ తన నోటి దురుసు ప్రదర్శించుకొన్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ప్రస్తుతం ఆయన (చంద్రబాబు నాయుడు) ఒక రాజధాని, అసెంబ్లీ కనీసం ఒక హైకోర్టు కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన భవనాలలో ఉంటూ తన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు,” అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్నారు.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆంధ్రా మంత్రులు, ఉద్యోగులు అందరూ మనకి అతిధులవంటి వారు. వారిని మనం ఎంత బాగా చూసుకొంటే వారు అంతకాలం ఇక్కడ ఉంటూ మనకి పన్నులు చెల్లిస్తుంటారు. కనుక వారిని మనం చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలి,” అని హితబోధ చేసారు. అటువంటప్పుడు మళ్ళీ “ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ లో ఏమి పని?” అంటూ ప్రశ్నించడం ఎందుకని ప్రజలు అడుగుతున్నారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల కేసీఆర్ కి ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి హైదరాబాద్ మరో 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగానే ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ అంతవరకు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుండే రాష్ట్రాన్ని పరిపాలించాలనుకొంటే దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి వీలులేదు. ఈ సంగతి అపార రాజకీయ అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియదనుకోలేము. అయినా కూడా ఆయన ఆవిధంగా మాట్లాడటం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. సాటి ముఖ్యమంత్రి, ఒకప్పుడు తనకి రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “ఆయనొక రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి” అని కేసీఆర్ హేళన చేయడం సబబు కాదని రాజకీయ వర్గాలలోనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వాస్తవిక దృష్టితో దీనిని చూసినట్లయితే ఇందులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ, ఉద్యోగులని గానీ నిందిచడానికి ఏమీ లేదని అర్ధమవుతుంది. తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమాల కారణంగా, తరుముకొస్తున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ ఈ వ్యవహారాన్ని పదేళ్ళపాటు నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని, హైకోర్టును, అసెంబ్లీ తదితర భవనాలను ఏర్పాటు చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి ఉండేది కాదు. కనీసం విభజన చేసే ముందయినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినా బహుశః ఇటువంటి అవహేళనలు ఎదుర్కోవలసిన అగత్యం ఉండేది కాదు. కానీ యూపీఏ ప్రభుత్వం ఎంత త్వరగా ఈ వ్యవహారం నుండి చేతులు దులుపుకొని తప్పు కొందామా..అని ఆలోచిందే తప్ప దాని పర్యవసానాల గురించి ఆలోచించదానికి కూడ ఇష్టపడలేదు. కనుక యూపీయే ప్రభుత్వం చేసిన తప్పులకి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను, ఉద్యోగులను గురించి చులకనగా మాట్లాడటం వలన ఇరురాష్ట్రాల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదని చెప్పవచ్చును.
అయినా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోగానే విజయవాడకు తరలిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఉద్యమాల సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అటువంటి మాటాలు మాట్లాడవలసి వచ్చింది తప్ప ఆంద్ర ప్రజలు, ఉద్యోగులు అంటే తనకి చాలా గౌరవమని కేసీఆరే స్వయంగా చెప్పుకొన్నారు. ఆ మాటలు నిజమనుకొంటే ఆయన లేదా మంత్రులు గానీ ఈవిధంగా మాట్లాడటం అనవసరం. ఒకవేళ తెదేపాతో ఇబ్బంది ఉన్నట్లయితే దానిని రాజకీయంగా ఎదుర్కోవడమే మంచి పద్ధతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.