ప్రత్యర్థులకి బొమ్మ చూపిస్తోన్న అమ్మ!

posted on: Aug 24, 2016 2:21PM

 

అమ్మ దయ వుంటే అన్నీ వున్నట్టే. ఇలా మనం చెప్పుకోవటం మామూలే. కాని, తమిళనాడులో పరిస్థితి మరీ దారుణం. అక్కడ 'అమ్మ' దయ లేకుంటే ఏమీ లేనట్టే! ఇంతకీ అమ్మెవరో తెలుసుగా? పురుచితలైవి జయలలితే!

 

జయలలితకు కోపం తెప్పిస్తే తమిళనాడు బార్డర్స్ లో వుండటం కష్టమే. అలా తయారైంది పరిస్థితి. పైగా ఈ మధ్యే ఆరోసారి చెన్నై సింహాసనం అధిష్టించిన అమ్మగారు ఎవ్వరికీ వినటం లేదు. ఆమెను వ్యక్తిగతంగా విమర్శించటం కాదు కనీసం పాలనాపరమైన అంశాలపై విమర్శిస్తే కూడా ప్రత్యర్థుల్ని ముప్పతిప్పలు పెడుతోంది. అందుకు, రాజమార్గంలో చట్టాన్నే ఎంచుకుంటోంది!

 

జయలలిత గత కొంత కాలంగా తన శత్రువుల పని పట్టేందుకు పరువు నష్టం దావాని ఆయుధంగా చేసుకుంది. ఎవ్వరు ఏ చిన్న విమర్శ చేసినా దాన్నే ప్రయోగిస్తుంది. అంతే కాదు, ప్రభుత్వ యంత్రంగమే ఈ కేసులు వేయటానికి రాత్రింబవళ్లూ కష్టపడుతోంది. చివరకు, ఇది ఎంత వరకూ వచ్చిందంటే సుప్రీమ్ కోర్టు జయలలితను హెచ్చరించాల్సి వచ్చింది!

 

సీఎం ఆరోగ్యం గురించి, ఆమె సెలవుల గురించి, నీటి సమస్య గురించి, ఎన్నికల హామీల అమలు సంగతి గురించి... ఇలా ఏ చిన్న అంశంలో వైరి వర్గం నోరు విప్పిన జయ పరువు నష్టం కేసుతో వాళ్లకు మూడు చెరువులు నీళ్లు తాగిస్తోంది. ఇలా అయితే, పబ్లిక్ లైప్లో వుండకూడదని సుప్రీమ్ ఆమెను కడిపారేసింది. ప్రజా జీవితంలో వున్నాక విమర్శలు వస్తుంటాయని, వాట్ని సమర్థంగా ఎదుర్కోవాలిగాని కేసులు వేసి న్యాయస్థానం సమయం వృథా చేస్తారా అంటూ ప్రశ్నించింది.

 

ఇలా అమ్మకు కోర్టు ఆశీర్వచనాలీయటం రెండు నెలల్లోనే ఇది రెండో సారి. అసలు 5ఏళ్లలో జయ ప్రభుత్వం 213పరువు నష్టం కేసులు వేసిందంటే... అరాచకం ఏ రేంజ్లో వుందో అర్థం చేసుకోవచ్చు!

google-ad-img
    Related Sigment News
    • Loading...