డీ-రెగ్యులేషన్ విధానాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

posted on: Apr 13, 2026 5:59PM

 

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి అనుమతుల ప్రక్రియను మరింత సరళీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అనవసర చట్టాలు, నిబంధనలను తొలగించి పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు.

కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలసి, డి-రెగ్యులేషన్ ఫేజ్-2 కార్యక్రమంపై చర్చించింది. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ సహా పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు వేగం

పరిశ్రమల స్థాపనలో జాప్యం తగ్గించేందుకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని సీఎం సూచించారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. డి-రెగ్యులేషన్ ఫేజ్-1లో 7 శాఖల్లో 23 కీలక అంశాలను పూర్తి చేశామని, ఫేజ్-2లో 28 అంశాలను లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 47 సిఫార్సుల్లో ఇప్పటివరకు 18 అమలు కాగా, మే 31 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.

నిబంధనల భారీ కోత

ప్రస్తుతం ఉన్న 800కి పైగా నిబంధనలను 100లోపు తగ్గించాలని, అనుమతుల లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేశారు. థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇచ్చి, డబుల్ లైసెన్సింగ్‌ను పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ పొందిన వ్యాపారాలకు జీవితకాల చెల్లుబాటు కల్పించే విధంగా వ్యవస్థను రూపుదిద్దాలని అన్నారు.

ఆన్‌లైన్ అనుమతుల వ్యవస్థ

దరఖాస్తు నుంచి అనుమతి వరకూ మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్-2 అమలు తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయం కనీసం 40% తగ్గేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఒకే శాఖలోని అనుమతులను విలీనం చేసి, పర్మిషన్లకు బదులుగా ‘ఇంటిమేషన్’ విధానం అమలు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 82 అనుమతులను 57కు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

భూ వినియోగంలో సంస్కరణలు

భూ వినియోగానికి సంబంధించిన క్లిష్టతను తగ్గిస్తూ, డిమాండ్ ఆధారిత జోనింగ్ విధానాన్ని అమలు చేయాలని సీఎం తెలిపారు. పరిశ్రమల పార్కులు, క్లస్టర్లలో భూమి కేటాయింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని అనుమతులకు ఒకే నోడల్ ఏజెన్సీ వ్యవస్థపై దృష్టి పెట్టాలని సూచించారు.

అఫిడవిట్‌తో వ్యాపారం ప్రారంభం

ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహంగా అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పించాలని సీఎం చెప్పారు. ఫైర్ సేఫ్టీ, పర్యావరణ, విద్యుత్ అనుమతులను వేగవంతం చేయాలని ఆదేశించారు. డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ‘మీ సేవ’, సింగిల్ డెస్క్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

కేంద్రం కంటే ముందంజలో ఏపీ

డి-రెగ్యులేషన్‌లో కేంద్రం కంటే ఏపీ మెరుగ్గా పనిచేస్తోందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ప్రశంసించారు. ఫేజ్-2ను గడువులోగా పూర్తి చేస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు రాష్ట్రం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో ఫేజ్-3లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...