అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

posted on: Jun 21, 2026 8:29AM

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం (జూన్ 21) దేశ వ్యాప్తంగా  ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ఏపీలో రికార్డు సృష్టించాయి.    విజయవాడలో జరిగిన  ప్రధాన ఉత్సవంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.  యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.

ఈ ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా యోగాసనాలు వేశారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన చూపిన చొరవ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.   వేదికపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ స్వయంగా పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రితో అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామాలు చేయించారు.  

మరోవైపు పతంజలి యోగపీఠానికి చెందిన శిక్షకులు, రామ్‌దేవ్ బాబా ముఖ్య అనుచరులు ప్రదర్శించిన  ఆసనాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యంత కష్టతరమైన భంగిమలను సైతం వారు అవలీలగా వేసి చూపించడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్ ప్రసంగిస్తూ.. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా  అద్భుతమైన సాధనమన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలని  పిలుపునిచ్చారు.

ఈ   వేడుకల్లో   ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు  నేతలు  పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్,  కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు   సామాన్యులతో కలిసి ఆసనాలు వేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఇందిరాగాంధీ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణలు శృతిమధురంగా వినిపించడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...