కేసీఆర్ విషయంలో నేను చేసింది తప్పే...
posted on Feb 28, 2018 11:06AM
.jpg)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు కేసీఆర్ అలా పిలిపించుకుంటున్నారు అంటే దానికి కారణం నేనే అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..నిజానికి కేసీఆర్ ప్రత్యేక పార్టీ పెట్టడానికి... ఆ తరువాత ప్రత్యేక రాష్ట్ర పోరడటానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని కారణంగానే వేరే పార్టీ పెట్టారని కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1999లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవటం నేను చేసిన తప్పిదమే.. కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పడటం నుండి ఇప్పుడు రాష్ట్రం విడిపోయే వరకూ జరిగి ఉండేది కాదని తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతేకాదు... కేసీఆర్ ను కాదని విజయ రామారావుకి మంత్రి పదవి ఇచ్చానని.. నిజానికి విజయరామారావు అంత సమర్ధుడు కాదని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ తనకు పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందడం... దానికిగాను ఇస్తానని చెప్పడం...అందుకు ఆయన అంగీకరించకపోవడం... బయటకి వచ్చి టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని పెట్టడం జరిగిపోయాయని వివరించారు. ఆ తరువాత తెలంగాణకి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రత్యేకం తెలంగాణ ఉద్యమం చేసి ఆఖరికి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా సంపాదించారనుకోండి. ఏది ఏమైనా ఆనాడు తాను చేసిన తప్పును ఇప్పుడు దాదాపు 20 ఏళ్లకు చంద్రబాబు ఒప్పుకోవడం గమనార్హం. ఆనాడే కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో...