Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సామర్ధ్యం పెంపుతోనే పటిష్ట ఆర్ధిక వ్యవస్థ : సీఎం చంద్రబాబు
posted on: May 13, 2026 8:55PM
.webp)
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
జీఎస్డీపీ అంచనాలను సంప్రదాయ విధానంలో కాకుండా రియల్‌టైమ్ మానిటరింగ్ ద్వారా రూపొందించేలా శిక్షణ అందించాలన్నారు. సచివాలయంలో బుధవారం ప్రణాళిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి... త్వరలోనే పూర్తి స్థాయిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుడతామన్నారు. సమీక్షలో జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్, ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రధాన సర్వేలు, జిల్లా-మండల స్థాయి అధికారులకు శిక్షణ, కేపీఐల ఆడిటింగ్ అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.
ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ
ప్రస్తుతం రాష్ట్ర జీఎస్డీపీ అంచనాలు మూడు నెలలకు, ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. చారిత్రక డేటాపై ఎక్కువ ఆధారపడటం వల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని ప్రతీ నెలా... ప్రతీ జిల్లాలో, ప్రతీ మండలంలో ట్రాక్ చేయగలిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు.
ఇందుకోసం జీఎస్డీపీ విధానాన్ని అర్థం చేసుకునేలా, అంచనాలు వేగంగా రూపొందించేలా అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. మొత్తం 5 జోన్లు, 28 జిల్లాలు, 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ మూడు నెలల పాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లు, జోనల్-జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల తయారీపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. మరోవైపు వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఏఐ ఆధారిత ఆర్థిక విశ్లేషణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం ట్రాక్ చేయని సూచికలను గుర్తించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.






