తలసీమియా బాధిత బాలుడికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం

posted on: May 1, 2026 9:26PM

 

పమిడిముక్కలలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ..

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం..

పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమంపై దృష్టి...
 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తలసీమియాతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడు చాగంటిపాటి వివేక్‌కు రూ.10 వేల పింఛన్ అందించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

వివేక్‌కు తలసీమియా కారణంగా నెలకు మూడు నుంచి నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. చదువులోనూ వివేక్ చురుకుగా ఉంటాడని, చికిత్సకు సహాయం చేయాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

అనంతరం ముఖ్యమంత్రి పమిడిముక్కల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పింఛన్ల పంపిణీ అనంతరం మరో కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో అక్కడ ఆగారు.

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం, వారు పాడిన రైమ్స్‌ను ఆసక్తిగా విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి టీచర్లు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...