అమరావతిని ఆవిష్కరించే దిశగా మరో అడుగు!

posted on: Nov 4, 2016 10:46AM

 

తెలంగాణ ఏర్పాటు తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇప్పుడు రెండు ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకవైపు కేసీఆర్ విజయవంతంగా ఉద్యమం నడిపించి అధికారంలోకి వస్తే మరో వైపు చంద్రబాబు విజయవంతంగా నవ్యాంధ్రను ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ కు వడ్డించిన విస్తరి లాంటి భాగ్యనగరం వుండటంతో ఆయన బంగారు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. కాని, బాబు అమరావతిని పునాదుల్నుంచీ పైకెత్తుతున్నారు. ఇది ఒక విధంగా సవాలే అయినా ఆయన రాజకీయ జీవితానికి పెద్ద ప్లస్ పాయింట్ కూడా! చంద్రబాబు హయాంలో అమరావతి తొలి అడుగులు వేసిందని చరిత్ర ఎప్పుడూ చెప్పుకుంటూనే వుంటుంది... 


జనం టీడీపిని నమ్మి అధికారం ఇచ్చినా... ప్రతిపక్షం, అలాగే కొంత మంది గిట్టనివారూ అమరావతిపై ఆరోపణలు చేస్తూనే వున్నారు. రైతుల భూములు తీసుకోవటం నుంచి మొదలు పెడితే ప్రతీ దాంట్లో చంద్రబాబుకు అడ్డంకులే ఎదురయ్యాయి. అయినా ఆయన తన అపార అనుభవం రంగరించి రాష్ట్రాన్ని, రాజధాన్ని ఒక కోలిక్కి తీసుకొస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన విట్ శంఖుస్థాపనే నిదర్శనం...


వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షార్ట్ గా విట్ అని పిలవబడే ప్రతిష్ఠాత్మక సంస్థ ఇప్పుడు ఆంధ్రాకి తరలి వచ్చింది. 2వందల ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడుతోన్న ఈ విద్యా సంస్థ ఖచ్చితంగా క్యాపిటల్ సిటీకి హైలైట్ కానుంది. అంతే కాదు, ముందు ముందు రాబోయే మరిన్ని ప్రెస్టేజియస్ ఇన్ స్టిట్యూట్స్ కి మార్గం సుగమం చేయనుంది. మొత్తంగా అమరావతిలో విద్యా రంగం త్వరలోనే పురివిప్పుతుందని మనం ఆశించవచ్చు... 


విట్ లాంటి ఒక ప్రైవేట్ సంస్థ అమరావతికి రావటం పెద్ద విశేషమేం కాదనే వారు కూడా వుంటారు. కాని, ఉన్నత విద్యని అందించే ఒక పేరెన్నికగన్న ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆంధ్రా విద్యార్థులకి అందుబాటులోకి రావటం ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే, ప్రస్తుతం చాలా మంది స్టూడెంట్స్ హైద్రాబాద్ తో సహా అనేక ఇతర నగరాల్లో వుంటూ చదువుకుంటున్నారు. కొందరైతే విదేశాలకు కూడా వెళుతున్నారు. మరి ఇంతటి డిమాండ్ విద్యా రంగంలో వున్నప్పుడు అమరావతిలో ఆ దిశగా అభివృద్ధి జరిగిలే చూసుకోవటం మంచిదే కదా! విట్ ఏర్పాటు అటు వేపుగా తొలి అడుగు అనుకోవాలి...


ఏ నగరమైనా విద్యా రంగం, విద్యా సంస్థల వల్లే ప్రపంచ ప్రాఖ్యాతి పొందుతుంటుంది. ప్రైవేట్ , ప్రభుత్వ విద్యా సంస్థలతో త్వరలోనే అమరావతి అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆశిద్దాం...
 

google-ad-img
    Related Sigment News
    • Loading...