ఆ చంద్రబాబే కావాలి.. ఈ చంద్రబాబు వద్దు

 

హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మాణంకోసం, సింగపూర్ తరహా రాజధాని నిర్మాణం కోసం కట్టుబట్టలతో నడిరోడ్డుపై నిలబడిన ఆంధ్రుల పాలిట నవశకానికి నాంది పలికే నాయకుడిగా అవశేష ఆంధ్ర ప్రదేశ్ ను అట్టడుగు స్థానం నుండి అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లగలిగే స్థైర్యం ఉన్న నేతగా నమ్మి ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించి పట్టం కట్టారు.

కాని నేడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు కావాలి కాని, నేటి చంద్రబాబు కాదు అని సినీ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ అందరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క శివాజీ ఆరోపణ మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పార్టీని అంటిపెట్టుకొని, పార్టీకోసం నిరంతరం కృషి చేస్తున్న చాలా మంది సీనియర్ల నుండి కార్యకర్తల వరకు అదే భావన. చంద్రబాబు నాయుడు చుట్టూ ఒక కోటరీ ఉన్నదని.. ఆయన ఆ కోటరీ ఉచ్చులో బిగుసుకొని వాస్తవాలను గుర్తించడంలేదని చాలా మంది నేతల వేదన.

ఆయన చుట్టూ ఉన్న కోటరీని ఒకసారి గమనిస్తే క్షేత్రస్థాయి అవసరాలపై, సమస్యలపై అవగాహన లేని పరకాల ప్రభాకర్ లాంటి ప్రభుత్వ సలహాదారు, తిమ్మిని బమ్మిని చేసి చూపే ఐఏస్ ఆఫీసర్లు, బ్యూరో క్రాట్స్.  ప్రభుత్వ పథకాల పనితీరు, అమలు ఎలా ఉన్నా వీరికి అనవసరం. చంద్రబాబు నాయుడిని ఎంతగా తమ కల్లబొల్లి మాటల ద్వారా సంతృప్తి కరంగా ఉంచగలిగామన్నదే వారి ఆలోచన. దీనికి తోడు విమర్శలు గిట్టని చంద్రబాబు నైజం. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని బాబు వరకూ చేరకుండా అంతా బాగానే ఉందనే ఈ కోటరీ కితాబు. దీనితో ఆంధ్ర రాష్ట్రంలో బాబుగారి పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి గాడితప్పిన పాలన. బాబుగారి వ్యవహారం చూస్తేనే తన చుట్టూ ఉన్నా భజన పరుల కోటరీలో సదా కాలక్షేపం.

ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైనా సరే ఈ కోటరీని దాటి బాబుగారిని చేరే పరిస్థితి లేని కారణాన ఏం చేయాలో అర్ధంకాని దైన్యం పార్టీలో నెలకొంది. దీనికి తోడు లోకేశ్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏ ఐఏస్ ఆఫీసర్ అయినా లోకేశ్ కన్నుసన్నల్లోనే పనిచేయాల్సి రావడంతో ఈ భజన బృందం లోకేశ్ ను కూడా అదే తరహాలో పొగడ్తలతో ముంచెత్తుతూ, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ పాలనను అపహాస్యం చేస్తున్నారు.

వీరికి తోడు వివిధ ప్రాజెక్టులను దక్కించుకునే యావలో కాంట్రక్టర్లు పార్టీలోని ఆర్ధిక బలంతో మధ్యలో వచ్చి పెత్తనం చేస్తున్న రాజకీయ అవగాహన, పరిపాలన అవగాహన లేని మరికొంతమంది నేతలతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతోంది.

దీనికి ఉదాహరణగా రాజమండ్రిలో పుష్కరాల సంఘటన, ప్రత్యేక హోదాపై రోజుకోరకమైన ప్రభుత్వ వ్యాఖ్యానాలు, రైతు రుణమాఫీ అమలవుతున్నతీరు, నిరుద్యోగ భృతి అందని నిరుద్యోగులు, గుంటూరు నాగార్జున వ్యవహారం, రైతుల ఆత్మహత్యలు, అసెంబ్లీ నడుస్తున్న విధానం వెరసి నిజంగా ఇది చంద్రబాబు నాయుడి పాలనేనా అనే ప్రజలకు తీవ్రమైన సందేహం కలుగుతోంది.

తమ స్వలాభం కోసం, స్వార్థం కోసం వివిధ కన్సెల్టీలు, కాంట్రక్టర్లు, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ సలహాదారుల కోటరీ నుండి చంద్రబాబు బయటపడి తన పాలనలో ప్రజలు, నేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టినిసారించక పోతే నష్టపోయేది పార్టీనే. నీతికి మారుపేరైనా పరిపాలన అందిచకుంటే, తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన శైలి ఉందని విశ్లేషకులు సైతం విస్మయం చెందేలా అవినీతిలో కూరుకుపోయిన పాలనను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు స్వయంగా పూనుకోకపోతే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ఖాయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu