సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం : మంత్రి ఆనం
posted on Apr 19, 2025 4:20PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 75 పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
దేశ ఔన్నత్యాన్ని చాటుతూ చంద్రబాబు కోసం పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమం చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ఎక్స్‌లో ఒకటవ స్థానంలో ట్రెండ్ అవుతోంది.