ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు
posted on Nov 11, 2025 3:32PM
.webp)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది.
పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.