48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్
posted on Nov 8, 2025 2:54PM

పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 48 మంది శాసన సభ్యులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని సీఎం తెలిపారు.
నోటీసులు తీసుకున్న శాసన సభ్యులకు వివరణ తర్వాత చర్యలకు వెనకాడబోమని ముఖ్యమంత్రి స్ఫష్టం చేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని తెలిపారు. ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తెలిపారు. విశాఖలో ఈ నెల 14,15 సీఐఐ సమ్మిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి లోకేశ్ తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. గడుపులోపే క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు.
అమరావతి బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ స్థాయిలో భారీ ఈవెంట్లు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈవెంట్లకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇస్తోందని, ఇటీవల జరిగిన తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఓవైపు ఈవెంట్లు, మరోవైపు భారీ పెట్టుబడులతో ఏపీ వేగంగా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని సీఎం చెప్పారు.
నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని అభివర్ణించారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలపై కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. పార్టీ కమిటీలు నెలాఖరులోగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోందని తెలిపారు. పార్లమెంటు కమిటీల ఏర్పాటుపైనా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.