ఈ రాత్రి ఎలా గడుస్తుందో...ప్రజల్లో ఆందోళన!
posted on Oct 27, 2025 8:42PM

కోస్తా ప్రజలకు ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని ఆందోళన మొదలైంది. ఇప్పటికే తుఫాను తీవ్రత ప్రభావంతో కొండపోతుగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం తాకే దశలో పెను గాలులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ స్థితిలో తుఫాను తీవ్ర తుఫానుగా మారి మంగళవారం సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అంచనాలు వేస్తోంది. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
మొంథా తుఫాను ప్రస్తుతం చెన్నై కాకినాడ విశాఖపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాతావరణ శాఖ అంచనాల బట్టి ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ఇది మరింత బలపడుతూ మంగళవారం పెను తుఫానుగా మారనుంది. ఈ దశలో తుఫాను కాకినాడ సమీపంలో తీరం తాకే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే తుఫాను ప్రభావంతో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వేచడంతోపాటు సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణం కంటే ఒక మీటర్ నుంచి మూడు మీటర్లు అధికంగా ఎగిసిపడుతున్నాయి. ఏపీలోని మొత్తం 26 జిల్లాల్లో 23 జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ రాత్రి చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా.
ఈ స్థితిలో సోమవారం రాత్రి ఏ రకంగా గడుస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగంతో సర్వం సిద్ధం చేసింది..ఎన్టీఆర్‌ఎఫ్ ..ఎఫ్డిఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు