జడ్జీలను కించపరిచడం కొందరికి ఫ్యాషన్.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్
posted on: Aug 6, 2021 1:22PM
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి సీరియస్ అయ్యారు. న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు .తమకు అనుకూలమైన తీర్పులు రాకుంటే న్యాయవ్యవస్థను కించపరిచడం ఎక్కువైందని, ఈ ట్రెండ్ దురదృష్టకరమని జస్టిస్ ఎన్వీ రమణ కామెంట్ చేశారు. న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా లేదన్నారు. న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా పోలీసులు, సీబీఐ స్పందించడం లేదని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ.
జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థకు ఐబీ, సీబీఐ సహకరించడం లేదని అన్నారు. పూర్తి బాధ్యతతో తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. జార్ఖండ్ జడ్జి హత్య వ్యవహారమే ఒక ఉదాహరణ అని తెలిపారు. జడ్జీ హత్యకావడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు.
గనుల మాఫియా ఉన్న ప్రాంతంలో జడ్జిలకు, వారి నివాస ప్రాంతాలకు పూర్తి రక్షణ కల్పించాలన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. న్యాయవ్యవస్థలో దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన దగ్గర ఉందని తెలిపారు. న్యాయమూర్తుల రక్షణపై కొన్ని రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేశాయన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా స్టేటస్ రిపోర్టులు దాఖలు చేయాలని సూచించారు.ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.


.jpg)



