Latest News

సివిల్స్‌ గురువుగా సత్తా చాటిన భగవత్‌... టాప్‌–100లో 37 మంది!

posted on: Mar 13, 2026 2:59PM

 

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ భగవత్‌ మరోసారి సివిల్స్‌ గురువుగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ దశలో మార్గదర్శనం చేస్తూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష–2025 ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేశ్‌ భగవత్‌ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్‌–100 ర్యాంకుల్లో నిలిచారు. మహేశ్‌ భగవత్‌ శిష్యురాలు తేజస్వినీ సింగ్‌ 62వ ర్యాంకు సాధించడమే కాకుండా, ఇంటర్వ్యూలో అత్యధికంగా 225 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ టాపర్‌గా గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ డీఎస్పీగా శిక్షణ పొందుతున్నారు.

అలాగే దైనెంపల్లి ప్రవీణ్‌ 793వ ర్యాంకు సాధించి ట్రైనీ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ఏపీ టాపర్‌గా జస్వంత్‌ జెన్ను  23వ ర్యాంకు సాధించగా, రాష్ట్రం నుంచి మరో 20 మంది అభ్యర్థులు కూడా ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా టాప్‌–10లో 3, 4, 6, 7 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా మహేశ్‌ భగవత్‌ బృందం నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకత్వం పొందినవారే కావడం గమనార్హం. అభ్యర్థులు కష్టపడి సాధించిన ఈ విజయానికి మెంటర్ల సహకారం కూడా ఎంతో తోడ్పడిందని మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఆయన మార్గదర్శకత్వం వల్ల మరెంతో మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...