గజపతిరాజును చూసి కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి!!

 

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు రాచకుటుంబానికి చెందిన వ్యక్తి అయినా చాలా నిరాడంబరంగా వుంటారు. అసామాన్యుడైన వ్యక్తి అయినప్పటికీ సామాన్యులతో కలసి మెలసి వుంటారు. ఆయనకి వున్న ఈ క్వాలిటీయే ఆయన్ని మంచి ప్రజా నాయకుడిగా నిలబెట్టింది. నరేంద్రమోడీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా చేసింది.

 

పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు చక్కని పనితీరు కనబరుస్తున్నారన్న ప్రశంసలు వినిపిస్తున్నారు. తమ ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ తమకు విద్యాధికుడు, సౌమ్యుడు అయిన అశోక్ గజపతిరాజు మంచి మంత్రివర్గ సహచరుడిని ఇచ్చిందన్న ప్రశంసలు లభిస్తున్నాయి.

 

ఈ ప్రశంసలన్నీ ఒక ఎత్తయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన ఒక ఎత్తు. పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఆయనకు దేశంలోని ఏ ఎయిర్‌పోర్టులో అయినా రాయల్ ట్రీట్‌మెంట్ వుంటుంది. ఆయన ఎయిర్‌పోర్టులో విమానం దగ్గరకి ఏసీ కారులో వెళ్ళే అవకాశం కూడా వుంది. అయితే ఆయన ఆ సదుపాయాన్ని ఎంతమాత్రం వినియోగించుకోవడం లేదు. తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఆయన తన సూట్‌కేస్ తానే మోసుకుంటూ మిగతా ప్రయాణికులందరితో కలసి క్యూలో నిల్చుని చెకింగ్‌కి సహకరించారు. ఎయిర్‌పోర్టు భవనం నుంచి విమానం వరకు తన తోటి ప్రయాణికులతో కలసి బస్సులోనే ప్రయాణించారు. ఆయన నిరాడంబరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మనసులోనే ఆయనకు అభినందనలు తెలిపారు. అన్నీ వున్న ఆకు అణిగిమణిగి వుంటుంది అనడానికి అశోక్ గజపతిరాజు ఒక ఉదాహరణ అనుకున్నారు.

 

అశోక్ గజపతిరాజు లాంటి మంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన వారు, ఏమీ లేని ఆకులా ఎగిరెగిరి పడేవారు మన రాజకీయ రంగంలో చాలామంది వున్నారు. పదవి వుంది కదా అని బిల్బప్పు కోసం ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు పెట్టేవారు. తాము ప్రజా ప్రతినిధులం కాబట్టి తమకు అదనపు సదుపాయాలు కావాలని డిమాండ్ చేసేవారు, తమ దగ్గర పనిచేసే ప్రభుత్వోద్యోగుల చేత అడ్డమైన సొంత పనులు చేయించేవారు. తమ దగ్గర పనిచేసే పోలీసుల చేత కూరగాయలు తెప్పించుకునేవారు, తమ షూలకి ప్రభుత్వోద్యోగుల చేత, సెక్యూరిటీ అధికారుల చేత లేసులు కట్టించేవారు... ఇలాంటి నాయకులందరూ అశోక్‌ గజపతిరాజును చూసయినా మారితే దేశం కొంత అయినా బాగుపడుతుంది.