రాజకీయాలకి చిరంజీవి గుడ్ బై?

posted on: May 22, 2014 6:44PM

 

 

 

మాజీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సినీ హీరోగా వున్నప్పుడు ఎన్నో గౌరవాలు అందుకున్న ఆయన ఏ ముహూర్తాన ప్రజారాజ్యం పార్టీని పెట్టి రాజకీయాలలోకి వచ్చారోగానీ అప్పటి నుంచి ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ప్రజాదరణ లేని తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి సంపాదించుకున్నప్పుడు ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

 

కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పనిచేస్తారని ఆయనకి ఓట్లేసిన జనం ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో బిత్తపోయారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అంశంలో చిరంజీవి వ్యవహరించిన తీరు సీమాంధ్రులకు బాగా బాధని కలిగించింది. ఆ తర్వాత తాజా ఎన్నికలలో చిరంజీవి సీమాంధ్రలో ఎంత గొంతు చించుకుని అరిచినా ఎంతమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవడానికి చిరంజీవి కూడా ఒక కారణం కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రజల చేతిలో ఘోర పరాభావాన్ని పొందిన చిరంజీవి ఎన్నికల ఫలితాల తర్వాత బయట కనిపించడం మానేశారు. దీంతోపాటు ప్రస్తుతం మాజీమంత్రిగా మిగిలిపోయిన చిరంజీవికి  అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో రాజకీయంగా బలం జీరోగా మిగిలింది.


మరో మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం మినహా ఆయనకు మిగిలిందేమీ లేకుండా పోయింది. రాష్ట్ర రాజకీయాలలో చిరంజీవికి ఇక ఎంతమాత్రం సీన్ లేదని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ని దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. సోనియాగాంధీని కలవటానికి చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు అపాయింట్‌మెంట్ దక్కలేదని సమాచారం. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీకి, ఆయనకి సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ చెయ్యి పట్టుకుని బీజేపీ పంచలోకి చేరితే బాగుంటుందన్న ఆలోచన చిరంజీవికి వచ్చినప్పటికీ, బీజేపీలో ఆయన మీద ఎవరికీ ఇంట్రస్ట్ లేకపోవడంతో ఇక రాజకీయాల నుంచి తప్పుకుని ప్రశాంతంగా వుండటం మంచిదన్న ఆలోచనలో చిరంజీవి వున్నట్టు సమాచారం. అదే జరిగితే తెలుగు సినిమా ప్రేక్షకులు త్వరలో చిరంజీవి 150వ సినిమా చూడటం ఖాయం.

google-ad-img
    Related Sigment News
    • Loading...