విద్యుత్తు చార్జీల పై చిరు రివర్స్ గేర్
posted on Apr 1, 2013 8:40AM
.jpg)
విద్యుత్తు చార్జీల పెంపు నిర్ణయాన్ని తప్పుబడుతూ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుడు చిరంజీవి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆయన ఆజాద్‌కు ఆ లేఖ పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదంటూ దానివల్ల జరిగే నష్టాలను లేఖలో వివరించారు.
ఈఆర్సీ టారిఫ్ నిర్ణయించిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, కానీ, ఉపసంఘం పరిశీలన లేకుండానే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వస్తాయంటూ నిర్ణయం తీసేసుకున్నారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు, మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండగా విద్యుత్ చార్జీలను పెంచారని, ఇది ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే విపక్షాలన్నీ విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమబాట పట్టాయని, కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చార్జీల పెంపుపై నియోజకవర్గాల్లో సమాధానం చెప్పుకోవడం పార్టీ నేతలకూ ఇబ్బందికరమేనన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆజాద్‌ను కోరారు.