ఐబొమ్మ రవి అరెస్టు.. సజ్జనార్ కు చిరంజీవి సహా సినీ ప్రముఖుల ధ్యాంక్స్
posted on Nov 17, 2025 11:31AM

తెలుగు సినీ పరిశ్రమ ఉనికికే ముప్పుగా ఐబొమ్మ వెబ్ సైట్ పరిణమించిన సంగతి తెలిసిందే. అటువంటి ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నది. ఐబొమ్మ రవిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు నేడు అతడిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవిని అరెస్టు చేసినందుకు సినీ ప్రముఖులు సీపీ సజ్జనార్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.
మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు సోమవారం (నవంబర్ 17)న సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారు పోలీసుల పనితీరును ఈ ప్రశంసించారు. కాగా ఆ తరువాత సీజీ సజ్జనార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా వీరు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జనార్ రవిని అరెస్టు చేసిన సమయంలో ఆయన వద్ద నుంచి మూడు కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. అయితే సినిమాల పైరసీ ద్వారా ఐబొమ్మ రవి 20 కోట్ల రూపాయలకు పైగా సంపాదించినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.
ఈ విషయానికి సంబంధించి మరింత లోతైన దర్యాప్తు జరుపుతామన్నారు. రవి అరెస్టు సందర్భంగా అతడి నుంచి కొన్ని హార్డ్ డిస్క్ లు, లాప్ టాప్ సీజ్ చేశామన్నారు. రవి వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లలో దాదాపు 21 వేల సినిమాలు ఉన్నాయన్నారు. అలాగే దాదాపు 50 వేల మంది సబ్ స్క్రైబర్ల డేటా కూడా ఉందని చెప్పిన సజ్జనార్.. ఇది చాలా ప్రమాదకరమన్నారు. కాగా సినిమాల పైరసీ మాత్రమే కా కుండా.. రవి భారీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ న కూడా ప్రమోట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. రవికి సంబంధించి ఎవరివద్దనైనా ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు.